Saturday, November 15, 2025
Homeబిజినెస్SEBI Report: గతేడాది రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.1.06 లక్షల కోట్ల నష్టం

SEBI Report: గతేడాది రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.1.06 లక్షల కోట్ల నష్టం

Retail Investors: స్టాక్ మార్కెట్లో డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అనే ట్రేడింగ్ ఒకటి ఉంది. దీనిలో ట్రేడింగ్ చేసే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. కానీ దీనిలో అత్యధికంగా నష్టపోయేవారే ఎక్కువగా ఉంటారు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) డెరివేటివ్ ట్రేడర్లకు సంబంధించిన అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం చూస్తే, రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్‌లో భారీగా నష్టపోతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం గమనిస్తే, రిటైల్ ట్రేడర్ల దాదాపు  రూ.1.06 లక్షల కోట్ల నష్టాన్ని చూశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 41% పెరిగింది, అంటే 2023-24లో నమోదైన రూ.74,812 కోట్ల నష్టంతో పోలిస్తే ఈ ఏడాది నష్టం మరింత అధికమైంది. ఇది ట్రాన్సాక్షన్ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని లెక్కించిన నష్టం కావడం గమనార్హం. ఇది మాత్రమే కాకుండా ఒక్కో రిటైల్ ట్రేడర్ నష్టం కూడా పెరిగింది. గత ఏడాది సగటు నష్టం రూ.86,728 ఉండగా, ఈ ఏడాది అది రూ.1.1 లక్షల రూపాయలుకు పెరిగింది. ఇది వ్యక్తిగత ట్రేడర్లకు ఒక హెచ్చరిక వంటిది.

- Advertisement -

సెబీ గణాంకాల ప్రకారం, గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో రిటైల్ ఇన్వెస్టర్లు కలిపి రూ.2.86 లక్షల కోట్లు నష్టపోయారు.

  • 2021-22: రూ.40,824 కోట్లు
  • 2022-23: రూ.65,747 కోట్లు
  • 2023-24: రూ.74,812 కోట్లు
  • 2024-25: రూ.1,05,603 కోట్లు

ఈ సంఖ్యలు ప్రతి ఏడాది నష్టాలు ఎలా పెరుగుతున్నాయో స్పష్టంగా చూపుతున్నాయి.

డెరివేటివ్స్‌లో 91% రిటైల్ ట్రేడర్లు నష్టాల్లోనే

SEBI నివేదిక ప్రకారం, ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్ చేసే వ్యక్తుల్లో 91% మందికి నికర నష్టాలే వచ్చాయి. ఇది ఈ విభాగంలో కొనసాగుతున్న నిర్మాణాత్మక సమస్యలను సూచిస్తోంది. దాదాపు అన్ని రిటైల్ ట్రేడర్లు నిరంతరంగా నష్టాలు ఎదుర్కొంటున్నారన్నది ఆందోళనకరమైన అంశమని చెప్పవచ్చు. ఇకపోతే F&O విభాగంలో ట్రేడింగ్ చేస్తున్న యూనిక్ ట్రేడర్ల సంఖ్య 2024-25లో గత ఏడాదితో పోలిస్తే 20% తగ్గింది. అయితే ఇది రెండు సంవత్సరాల క్రితం కన్నా 24% ఎక్కువగా ఉంది. ఇదే విధంగా, రిటైల్ ట్రేడర్ల చేతిలో premium termsలో టర్నోవర్ 11% తగ్గింది, కానీ రెండు సంవత్సరాల కలిపి చూస్తే 36% పెరిగింది.

ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ విషయంలో ప్రీమియం టర్నోవర్ 9% తగ్గుదల ఉండగా, నోషనల్ టర్నోవర్ 29% తగ్గుదల చూపింది. అయితే రెండు సంవత్సరాల కలిపి చూస్తే ఇవి 14% మరియు 42% వరుసగా పెరిగినట్లు కనిపిస్తోంది. అంటే, వాల్యూమ్ తాత్కాలికంగా తగ్గినప్పటికీ, దీర్ఘకాలంగా చూస్తే ఇదే విభాగం వేగంగా పెరుగుతూనే ఉంది.

F&O ట్రేడింగ్‌లో ఉన్న అసమానతలు, ముఖ్యంగా ఫైనాన్షియల్ అవగాహన లోపం, రిస్క్ మేనేజ్‌మెంట్ లోపం వంటివి ఇన్వెస్టర్లకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని ఈ నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో SEBI రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మరిన్ని కఠిన నియంత్రణలు తీసుకురావచ్చని అంచనా. అలాగే, డెరివేటివ్స్ మార్కెట్‌లో సురక్షితంగా పాల్గొనాలంటే పూర్తిగా అవగాహన వచ్చాకే ట్రేడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad