Stock market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం రాణించాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీలను (Stock Market) ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 25వేల మార్క్‌కు మరింత చేరువైంది. సోమవారం ఉదయం 81,501 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) ఆరంభంలో కాస్త ఒడుదొడుకులకు లోనైంది. కానీ, దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో పుంజుకున్న సూచీ.. ఒక దశలో 81,799 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మళ్లీ ఒత్తిడికి గురైనప్పటికీ.. లాభాలను నిలబెట్టుకోగలిగింది. సోమవారం మార్కెట్ సెషన్‌లో సెన్సెక్స్ 329.05 పాయింట్ల లాభంతో 81,635.91 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ (Nifty) 24,894-25,021 మధ్య కదలాడింది. చివరకు 97.65 పాయింట్లు పెరిగి 24,967.75 వద్ద ముగిసింది.
Read Also: RBI Governor: దేశాభివృద్ధిపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
లాభాల్లో ఐటీ రంగ సూచీలు
ఐటీ రంగం సూచీలు లాభాల్లో ముగిశాయి. సెప్టెంబరులో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో ఐటీ రంగ సూచీ 2.3శాతం మేర రాణించింది. రియాల్టీ 0.7శాతం, లోహ రంగ సూచీ 0.6శాతం మేర పెరిగాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, నెస్లే ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి (Rupee) మారకం విలువ 6 పైసలు తగ్గి 87.58 వద్ద స్థిరపడింది.
Read Also: GST: జీఎస్టీ స్లాబులపై గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 22 నుంచే అమలు..!


