Shiprocket IPO: భారతీయ ఈ-కామర్స్ రంగంలో లాజిస్టిక్స్ సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న షిప్‌రాకెట్ (Shiprocket), భారీ స్థాయిలో పెట్టుబడులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. సింగపూర్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ టెమాసెక్ (Temasek) మద్దతు ఉన్న ఈ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్, పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ద్వారా ఏకంగా రూ.2,342 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ముసాయిదా పత్రాలను (DRHP) మార్కెట్ల నియంత్రణాధికారి సంస్థ సెబీ (SEBI) వద్ద దాఖలు చేసింది.
నిధుల సమీకరణ వ్యూహం:
షిప్‌రాకెట్ ఐపీఓలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. కంపెనీ కొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుత వాటాదార్లు తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించడం ద్వారా రూ.1,242.3 కోట్ల విలువైన షేర్లను విడుదల చేయనున్నారు.
Also Read: Market Alert – 2026లో స్టాక్ మార్కెట్ 15 రోజులు బంద్!
ఓఎఫ్‌ఎస్ ద్వారా తమ వాటాలను తగ్గించుకోవాలనుకుంటున్న ప్రముఖ వాటాదార్లలో లైట్‌రాక్, ట్రైబ్ క్యాపిటల్, బెర్టెల్స్‌మాన్, అలాగే సంస్థ వ్యవస్థాపకులు – గౌతమ్ కపూర్, సాహిల్ గోయల్, విశేష్ ఖురానా వంటి వారు ఉన్నారు. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను మార్కెటింగ్ కార్యకలాపాలు విస్తరించడానికి, టెక్నాలజీ మౌలిక సదుపాయాలను (Technology Infrastructure) అభివృద్ధి చేయడానికి వినియోగించనున్నారు. అలాగే, కొంత మొత్తాన్ని కంపెనీ రుణాల ముందస్తు చెల్లింపుల కోసం కేటాయించనున్నారు. ఐపీఓ కంటే ముందే (Pre-IPO) రూ.220 కోట్ల వరకు నిధులు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
శివగంగా డ్రిల్లర్స్ కూడా:
షిప్‌రాకెట్‌తో పాటు, హైడ్రోకార్బన్ రంగంలో సేవలు అందించే శివగంగా డ్రిల్లర్స్ అండ్ ఎక్స్‌ప్లోరర్స్ (Shivganga Drillers and Explorers) కూడా ఐపీఓకు సిద్ధమైంది. ఈ కంపెనీ రూ.400 కోట్ల నిధుల సమీకరణ కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది.
శివగంగ ఇష్యూ మొత్తం తాజా షేర్ల జారీ రూపంలోనే ఉండనుంది. ఈ నిధులను కొత్త ప్లాంట్ మరియు మెషినరీ కొనుగోలుకు, ఇప్పటికే ఉన్న రుణాల చెల్లింపునకు, మరియు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ రెండు కంపెనీల ఐపీఓలు రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపనున్నాయి.

