Mutual Funds: కరోనా తర్వాత దేశవ్యాప్తంగా పెరిగిన పెట్టుబడి అక్షరాస్యతతో ప్రజలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు SIP అలాగే లంప్ సమ్ పెట్టుబడులు మధ్య తేడాలను, ప్రయోజనాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. SIP అంటే నిర్దిష్ట కాలపరిమితిలో చిన్న మొత్తాలను క్రమంగా పెట్టుబడి పెట్టడం. అలాగే లంప్ సమ్ అంటే ఒకసారి పెద్ద మొత్తాన్ని ఎంచుకున్న ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేయటం.
SIP ప్రత్యేకతలు..
SIP వల్ల పెట్టుబడిదారులు మార్కెట్‌లో ధరల మార్పులను తగ్గించే రూపీ కాస్ట్ ఏవరేజింగ్ వల్ల లాభపడతారు. మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు చేసే పెట్టుబడుల నుంచి ఎక్కువ యూనిట్లు.. ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు పొందటం వల్ల సగటు ధర తగ్గుతుంది. SIP కనీస నెల పెట్టుబడి రూ.500 మాత్రమే కావడంతో చిన్న పెట్టుబడిదారులు కూడా తమ కలల వైపు అడుగులు వేయటం వీలవుతోంది. దీర్ఘకాలికంగా SIP పెట్టుబడులు సమయంతో పాటు వృద్ధిని పొందగలుగుతాయి.
లంప్ సమ్ పెట్టుబడి..
లంప్ సమ్ పెట్టుబడికి పెద్ద మొత్తంలో డబ్బును ఒకేసారి సమకూర్చుకోవాలి. ఇది మార్కెట్ స్థితిపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ధరలు తగ్గినప్పుడు లంప్ సమ్ పెట్టుబడి చేస్తే.. పెద్ద లాభాలు రావడం సాధ్యమౌతుంది. కానీ మార్కెట్లలో ఓలటాలిటీ ఎక్కువగా ఉండినప్పుడు ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది.
SIP vs లంప్ సమ్: ఏది ఎప్పుడు మంచిది?
SIP: స్థిరమైన ఆదాయం ఉన్నవారు, మార్కెట్‌పై ఎక్కువ రిస్క్ తీసుకోవలసిన అవసరం లేని వారు SIP విధానాన్ని ఎంచుకోవటం దీర్ఘకాలిక లక్ష్యాలకు సరిపోతుంది.
లంప్ సమ్: పెద్ద మొత్తంలో డబ్బున్నవారు.. మార్కెట్ కదలికలను పరిగణిస్తూ పెట్టుబడి పెట్టదలచినవారికి ఇది బెటర్. దీనికి కొంత మార్కెట్లపై పట్టుకూడా అవసరం. మార్కెట్ సైకిళ్లను అర్థం చేసుకోవటం వీరికి దోహదపడుతుంది మంచి రాబడులు పొందటానికి.
SIP… లంప్ సమ్ రెండింటి సమన్వయంతో పెట్టుబడులు నిర్వహించడం మంచి ఆలోచనని నిపుణులు చెబుతుంటారు. ఉదాహరణకు మార్కెట్ ధరలు తగ్గినప్పుడు లంప్ సమ్ మార్గంలో ఇన్వెస్ట్ చేయటం.. అలాగే రెగ్యులర్ SIP పద్ధతిలో పెట్టుబడిని తక్కువ రిస్క్ లో కొనసాగించటం రెండూ ముఖ్యమేనని వారు చెబుతున్నారు. అయితే మీ వద్ద ఉన్న నగదు, అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం మంచిది. కనీసం రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు పెట్టుబడి వ్యూహంతో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులు చూసే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.


