Moonlighting For Startups: బెంగళూరు టెకీ సోహమ్ పరిక్ అమెరికా స్టార్టప్‌ల కోసం మూన్‌లైటింగ్ (ఒక కాలంలో బహుళ పనులు) చేసినట్టు అంగీకరించి టెక్ పరిశ్రమలో పెద్ద సంచలనం రేపాడు. వారం రోజుల వ్యవధిలోనే ఉద్యోగం నుంచి తొలగించబడిన ఇతను, తాను వారానికి 140 గంటలు పని చేసినట్టు చెప్పాడు. తాను చేసిన పని స్కామ్ కోసమేమీ కాదని, ఆర్థిక అవసరం వల్ల చేశానని పేర్కొన్నాడు. టెక్ బ్యులిటెన్ పవర్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిక్ మాట్లాడుతూ, “ఇది నేను గర్వపడే విషయం కాదు. నేను దీనిని ఎవరికి ప్రోత్సహించను కూడా” అని అన్నాడు. తనకు ఆర్థిక పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. వాస్తవానికి ఏ ఒక్కరూ వారం 140 గంటలు పనిచేయాలనుకోరు కదా? కానీ తన పరిస్థితి వల్ల అలా చేశానని పరిక్ పేర్కొన్నాడు.
ఏఐ సహాయంతో గిగ్‌లు పెరిగాయా?
పరిక్‌ను AI టూల్స్ వాడిన విషయంలో కూడా ప్రశ్నించగా, “ఎఐ నాకు సహాయం చేసింది, కానీ అది ఎక్కువ జాబ్‌లు చేయడానికి కారణం కాదు” అని స్పష్టంచేశాడు. తాను ప్రాజెక్ట్ ఆధారంగా పని చేశానని, ఫిక్స్‌డ్ షెడ్యూల్‌లు అనుసరించలేదని చెప్పారు. ఈ వ్యవహారం తలెత్తటానికి అసలు కారణం, మిక్స్‌పానెల్ సహ వ్యవస్థాపకుడు సుహైల్ దోషీ సోషయల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (Twitter) లో చేసిన ఓ పోస్ట్. అందులో దోషీ.. సోహమ్ పరిక్‌ను ఉద్యోగంలో చేరిన వారం రోజుల్లోనే తొలగించినట్టు పేర్కొన్నారు. కారణం? మూన్‌లైటింగ్, అబద్ధపు రిజ్యూమే, తప్పుడు టైమ్‌లైన్లు అని చెప్పాడు.
దోషీ ప్రకారం, పరిక్ తన రెస్యూమేలో చెప్పిన 90% సమాచారం తప్పుడు అని ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, పరిక్ ముంబై యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, జార్జియా టెక్ నుంచి మాస్టర్ డిగ్రీ పొందినట్టు చెప్పినా, అతడి పనితీరు ఆ స్థాయిలో లేదని ఆరోపించారు. ఆయన వివిధ సంస్థలతో పనిచేశానని తెలిపినా, అవన్నీ అసత్యంగా అనిపిస్తున్నాయని అన్నారు.
ఒకేసారి 3-6 ఉద్యోగాలు?
సోహమ్ పరిక్‌పై వచ్చిన మరో పెద్ద ఆరోపణ ఏమిటంటే.. ఒకేసారి 3-6 ఉద్యోగాల్లో పనిచేస్తూ, overlapping షెడ్యూల్స్, “ghost work” వంకలు, తప్పుడు సర్టిఫికేట్లు చూపిస్తూ సంస్థల నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడన్నది. సంస్థలు అతడిని హైరింగ్ చేసే ముందు చేసిన వెరిఫికేషన్‌లు సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టెక్ రంగానికి ఇదో హెచ్చరిక
ఈ ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఒకవైపు ఉద్యోగ భద్రత లేని గిగ్ ఎకానమీ పెరుగుతుంటే, మరోవైపు కంపెనీలు మానవ వనరులపై సమర్థవంతమైన స్క్రీనింగ్ లేకుండా ఎలా ఇలాంటి నియామకాలు చేస్తున్నాయనే చర్చ ఊపందుకుంది. అలాగే వర్క్-లైఫ్ బాలెన్స్, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపైనా ఈ సంఘటన శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని చెబుతోంది.