Saturday, November 15, 2025
Homeబిజినెస్Gold Rally: త్వరలోనే హైదరాబాదులో తులం గోల్డ్ రూ.1,15,000 తాకొచ్చు.. రేట్ల ర్యాలీకి కారణాలివే..

Gold Rally: త్వరలోనే హైదరాబాదులో తులం గోల్డ్ రూ.1,15,000 తాకొచ్చు.. రేట్ల ర్యాలీకి కారణాలివే..

Gold Rate Rally: హైదరాబాద్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2025 సెప్టెంబర్ 16న నగరంలోని 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,930గా ఉంది. ఇటీవల బంగారం ధరలు విధ్వంసకరమైన ర్యాలీ కొనసాగించడంలో అనేక ప్రపంచ ఆర్థిక అంశాలు ముఖ్య పాత్ర పోషించాయి‌. రానున్న రెండు వారాల్లో దసరా పండుగ దగ్గర పడుతున్న వేళ షాపింగ్ చేద్దామనుకుంటున్న తెలుగు ప్రజలకు పెరుగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంకెంత కాలం అసలు ఈ ర్యాలీ.. రెండేళ్లలో పెరగాల్సిన రేట్లు 6 నెలల్లోనే పెరగటానికి కారణాలు ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

బంగారం ధరల హఠాత్తుగా పెరుగుదలకు ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాలు కారకంగా నిలిశాయి. మొదటిగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించడంతో ప్రపంచ పెట్టుబడిదారులు తిరిగి డెట్ మార్కెట్ అంటే బాండ్స్ నుంచి బంగారం వైపు మొగ్గుచూపారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులలోనూ వడ్డీ రేట్లు తగ్గింపు ధోరణి కనిపించడంతో స్థిరమైన పెట్టుబడి కోసం బంగారం ఎంపికగా మారింది‌.

రెండవది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్థిక భద్రత కోసం పెట్టుబడిదారులు బంగారంపైనే ఆధారపడుతున్నారు. రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడమూ దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి చేరేందుకు దోహదపడింది. అంతర్జాతీయంగా బంగారం దిగుమతులు కూడా గణనీయంగా పెరగడం, మార్కెట్‌లో డిమాండ్‌కు కారణంగా ఉంది. అలాగే సెంట్రల్ బ్యాంకులు యూఎస్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు తగ్గించి హెడ్జింగ్ కోసం ఆర్థిక వ్యవస్థలను కాపాడేందుకు బంగారాన్ని భారీగా కొనుగోలు చేయటం కూడా పసిడి పరుగులకు కారణంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర మరికొంతకాలం అధిక స్థాయిలో కొనసాగే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇతర కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు మరింత తగ్గించాలని భావిస్తున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో బంగారం మరింత ర్యాలీ కొనసాగించవచ్చని అంచనాలు ఉన్నాయి. పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారాన్ని ఎంచుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ మార్కెట్‌లో తులం ధర రూ.1,15,000కు కొన్ని రోజుల్లోనే చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా చరిత్రలో ఎన్నడూ కనీసం ఊహించని స్థాయిలకు బంగారం, వెండి ప్రస్తుతం పెరిగి ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad