- గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి 2026 పురస్కారం
- వరుసగా రెండో ఏడాది దక్కిన గుర్తింపు
- డిజిటల్ సేవలు, ఏఐ వినియోగానికి ప్రశంసలు
- 10 కోట్లు దాటిన యోనో యూజర్లు.. కొత్తగా 300కు పైగా శాఖలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ‘ప్రపంచంలోనే ఉత్తమ వినియోగదారుల బ్యాంకు–2026’ పురస్కారాన్ని గెలుచుకుంది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అందించే ఈ అవార్డు వరుసగా రెండో ఏడాది ఎస్‌బీఐకి దక్కింది. డిజిటల్ ఆవిష్కరణలు, మెరుగైన సేవలు, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి కృషి చేయడం ద్వారా వినియోగదారులకు కేంద్రంగా ఉండే బ్యాంకింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పినందుకు ఈ గుర్తింపు లభించినట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ.. డిజిటల్ రంగంలో బ్యాంకు చేపడుతున్న పరివర్తన ద్వారా భారీ సంఖ్యలో వినియోగదారులకు విశ్వసనీయమైన సేవలను అందించడమే లక్ష్యమని తెలిపారు. సాంకేతిక సామర్థ్యాలతో మరింత మందికి వేగంగా సేవలు చేరువవుతాయని, అదే సమయంలో బ్యాంకింగ్ సేవలు వ్యక్తిగతంగా, సులభంగా, నమ్మకంగా ఉండేలా ఉద్యోగులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది కాలంలో డిజిటల్ ఆవిష్కరణలు, సేవల నాణ్యత, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలపై పెట్టుబడులను పెంచడం ద్వారా వినియోగదారులతో బ్యాంకు సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు వివరించారు.
ఇక కొత్తగా ప్రారంభించిన యోనో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే 10 కోట్లకు మందికి పైగా వినియోగదారులు నమోదయ్యారు. ఏఐ ఆధారిత కస్టమర్ సేవలతో పాటు వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 300కు పైగా కొత్త శాఖలను ప్రారంభించి తన సేవల పరిధిని విస్తరించింది. డిజిటల్ సాంకేతికతతో పాటు భౌతిక శాఖల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం బ్యాంకు వృద్ధికి దోహదపడిందని ఎస్‌బీఐ తెలిపింది.

