Homeబిజినెస్Stock market: అమ్మకాలకు ఎగబడ్డ ఇన్వెస్టర్లు.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌..!

Stock market: అమ్మకాలకు ఎగబడ్డ ఇన్వెస్టర్లు.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌..!

Stock markets are in downfall today: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా మదుపర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో పాటు బంగారం, పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి కారణంగా ఆయా కంపెనీల స్టాక్స్‌ అమ్మేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన వినియోగం, విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునివ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది. ఈ వ్యాఖ్యలతో పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతుందనే భయాలు తీవ్రమయ్యాయి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nara-lokesh-meets-nitin-gadkari/

భారీగా పతనమైన ఐటీ, రియల్టీ స్టాక్స్‌..

బ్రాడర్ మార్కెట్‌లో నష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 2.54 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 3.17 శాతం మేర పతనమయ్యాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, రియల్టీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ప్రముఖ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టైటాన్ వంటి కంపెనీల షేర్లు 4.44 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఎస్‌బీఐ మాత్రమే లాభాల్లో ముగియడం ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చింది. స్టాక్‌ మార్కెట్‌ నిపుణుల ప్రకారం, నిఫ్టీకి తక్షణ మద్దతు 23,300 వద్ద, ఆ తర్వాత 23,100 వద్ద ఉందని చెబుతున్నారు. ఎగువ స్థాయిలో 23,500 వద్ద మద్దు ఉండే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, పటిష్ఠమైన దేశీయ ఆర్థిక మూలాలు మార్కెట్లకు వెన్నుదన్నుగా నిలుస్తాయని, స్టాక్‌ మార్కెట్ల పతనం తాత్కాలికమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News