Subsidy on Electric Two Wheelers: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు వేగంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ సబ్సిడీని రూ.20,000 నుండి రూ.30,000కి పెంచనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. కొత్తగా రూపొందించిన ఈవీ పాలసీ 2025 ప్రకారం ఈ సబ్సిడీని అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం తన కొత్త ఈవీ పాలసీని రూపొందించింది. రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఈ నూతన పాలసీని అమలు చేయనుంది. అయితే, ఈ సబ్సిడీ కేవలం ఒడిశా రాష్ట్రానికి చెందిన వారికే అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. అది కూడా ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులని తెలిపింది. దీని కోసం ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయలను కేటాయించినట్లు డ్రాఫ్ట్‌లో పేర్కొంది. కాగా, ఒడిశా తీసుకొచ్చిన ఈ కొత్త ఈవీ పాలసీ 2025 ప్రకారం.. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై ప్రతి kWh బ్యాటరీ సామర్థ్యానికి రూ.5,000 ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. ఇలా గరిష్టంగా రూ.30,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. గతంలో ఈ సబ్సిడీ రూ.20,000 వరకు మాత్రమే ఉండేది. ఈ సబ్సిడీ పెరుగుదల ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతుందని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది.
ఎలక్ట్రిక్ టాక్సీలకు 2 లక్షల వరకు సబ్సిడీ..
ప్రస్తుతం హెవీ బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, ద్విచక్ర వాహనాలు సైతం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయని, అందువల్ల ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని అందుకు అనుగుణంగా పెంచాలని నిర్ణయించినట్లు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ద్విచక్ర వాహనాలతో పాటు బ్యాటరీతో నడిచే ట్రాలీ ఆటోలు, కార్లు, టాక్సీలు, ట్రక్కులు, బస్సుల కొనుగోళ్లపై కూడా ఈ సబ్సిడీని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2030 వరకు అమలులో ఉండే ఈ సరికొత్త ఈవీ పాలసీ ద్వారా టాక్సీలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.1.50 లక్షల నుండి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. మరోవైపు. విద్యుత్ బస్సుల కొనుగోలుపై ఏకంగా రూ. 20 లక్షల వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈవీ కొనుగోళ్లను పెంచడమే లక్ష్యంగా..
కాగా, 2021లో తీసుకొచ్చిన ఈ నూతన పాలసీ ద్వారా గత నాలుగేళ్లలో 20% ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే, ఈ కాలంలో కేవలం 9% మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ లక్ష్యం నెరవేరకపోవడంతో నూతన పాలసీని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచడానికి తాజాగా సబ్సిడీని పెంచుతూ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ నూతన పాలసీ ద్వారా 2030 నాటికి ఒడిశాలో జరిగే వాహన రిజిస్ట్రేషన్లలో 50% ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


