Union Budget 2026 schedule: కేంద్ర బడ్జెట్ 2026 షెడ్యూల్‌పై గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. సాధారణంగా సెలవు దినాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టరనే ఊహాగానాలకు చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశ ఆర్థిక దిశానిర్దేశం చేసే యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీ ఖరారైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 ఆదివారం రావడంతో బడ్జెట్ సోమవారానికి మారుతుందని అందరూ భావించారు. అయితే సంప్రదాయాలను పక్కన పెట్టి.. ఫిబ్రవరి 1నాడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఇటీవలి కాలంలో ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
బడ్జె్ట్ గురించి ముఖ్యమైన తేదీలు ఇవే:
* జనవరి 28: రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.
* జనవరి 29: పార్లమెంటులో ఆర్థిక సర్వే విడుదల.
* ఫిబ్రవరి 1 ఆదివారం: ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగం.
* బడ్జెట్ సెషన్: మొదటి విడత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, అలాగే రెండో విడత మార్చి 9 నుండి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది.
also read Mukkunuma 2026: ఈ ఏడాది ముక్కనుమ పండుగ ఎప్పుడంటే?
ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ అరుదైన రికార్డు..
2026లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇది 88వ బడ్జెట్. గతంలో ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. కానీ 2017లో అరుణ్ జైట్లీ గారు దీనిని ఫిబ్రవరి 1కి మార్చారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం వింతగా అనిపించినా.. గతంలో 2015, 2016, 2025 సంవత్సరాల్లో శనివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి.
మరి ఆదివారం స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లో భారీ ట్రేడింగ్ జరుగుతుంటుంది. అందుకే ఫిబ్రవరి 1న ట్రేడింగ్ కోసం మార్కెట్లను తెరవాలా వద్దా అనే అంశంపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కసరత్తు చేస్తోంది. సాధారణంగా వారాంతాల్లో సెలవు ఉన్నప్పటికీ.. బడ్జెట్ వంటి కీలక సందర్భాల్లో గతంలో కూడా మార్కెట్లు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీనిపై ఫైనల్ ప్రకటన రావాల్సి ఉంది. అప్పుడో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున స్టాక్ మార్కెట్లు ఓపెన్ ఉంటాయా లేక క్లోజ్ లో ఉంటాయా అనే విషయం తెలుస్తుంది.

