Mumbai : దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సన్‌టెక్ రియాల్టీ లిమిటెడ్ సరికొత్త చరిత్రకు తెర తీసింది. అత్యంత సంపన్న వర్గాల కోసం ప్రత్యేకంగా అల్ట్రా లగ్జరీ హౌసింగ్ విభాగంలోకి అడుగుపెడుతూ సంచలనం సృష్టించింది. ఒక్కో ఫ్లాట్ ధరను ఏకంగా రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు విక్రయించాలని ప్రకటించడం రియల్ ఎస్టేట్ చరిత్రలోనే రికార్డు.
గతంలో గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ రూ. 100 కోట్లకు అమ్ముడుపోయిన రికార్డును సన్‌టెక్ అధిగమించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కోసం కంపెనీ ‘ఎమాన్సే’ (Emansé) అనే కొత్త బ్రాండ్‌ను పరిచయం చేసింది. ఈ ఇళ్లను కేవలం ‘ఆహ్వానం ద్వారా మాత్రమే’ (By Invite Only) విక్రయిస్తామని కంపెనీ సీఎండీ కమల్ ఖేతన్ స్పష్టం చేశారు.
Fake Coin: మార్కెట్లో నకిలీ 10 రూపాయల కాయిన్లు.. తేడాను ఇలా గుర్తించండి
ముంబై, దుబాయ్‌లలో నిర్మాణాలు
ఈ అత్యంత ఖరీదైన ప్రాజెక్టులను ముంబై, దుబాయ్‌లలో నిర్మించనున్నారు. ముంబైలోని నీపెన్సీ రోడ్తో పాటు, తొలిసారిగా విదేశీ మార్కెట్‌లోకి అడుగుపెడుతూ దుబాయ్ డౌన్‌టౌన్, బుర్జ్ ఖలీఫా కమ్యూనిటీలో నిర్మాణాలు చేపట్టనున్నారు. దుబాయ్ ప్రాజెక్టు పనులు 2026 జూన్ నాటికి ప్రారంభమవుతాయి. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ. 20 వేల కోట్ల ఆదాయాన్ని సన్‌టెక్ అంచనా వేస్తోంది.
ఈ అల్ట్రా లగ్జరీ ఇళ్లలో చదరపు అడుగు నిర్మాణ వ్యయమే రూ. 2.5 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఈ ప్రాజెక్టులు దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనున్నాయి. సుమారు 52.5 మిలియన్ చదరపు అడుగుల పోర్ట్‌ఫోలియో ఉన్న సన్‌టెక్ రియాల్టీ, ఈ కొత్త బ్రాండ్‌తో రియల్ ఎస్టేట్ లగ్జరీ ప్రమాణాలను పూర్తిగా మార్చనుంది. కంపెనీ నికర లాభం ఇటీవల 47% పెరిగిన నేపథ్యంలో, ఈ భారీ ప్రాజెక్టుల విజయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


