HomeTop StoriesTata EV: దుమ్ము రేపుతున్న టాటా ఈవీ.. కేవలం ఆరు నెలల్లో బుకింగ్స్ మూడింతలు

Tata EV: దుమ్ము రేపుతున్న టాటా ఈవీ.. కేవలం ఆరు నెలల్లో బుకింగ్స్ మూడింతలు

Tata EV Bookings Triple: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) వాటాను గణనీయంగా పెంచుకుంటోంది. గత ఆరు నెలల్లో ఈవీ బుకింగుల్లో మూడు రెట్ల పెరుగుదల నమోదైందని సంస్థ తెలిపింది. అయితే, ఈవీ ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉండటంతో, ఆర్డర్లను వెంటనే ఇవ్వలేకపోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ‘గత 2-3 నెలలను గమనిస్తే మేము ప్రతి నెలా మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాం. గత ఆరు నెలల్లో మాకు, మార్కెట్‌లో రెండో స్థానంలో ఉన్న సంస్థకు మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరిగింది. టాప్‌ లెవల్‌లో దూసుకుపోతున్నాం ఈవీల బుకింగుల్లో మేము 3 రెట్ల వృద్ధి సాధించాం. మాకు ఉన్న ఏకైక పరిమితి మా ఉత్పత్తి సామర్థ్యమే’ అని టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌ ముఖ్య వాణిజ్య అధికారి (సీఓఓ) వివేక్‌ శ్రీవత్స వెల్లడించారు. టీఎంపీవీలో టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌ భాగంగా ఉంది. కారు ప్రియులకు మా ఉత్పత్తులపై నమ్మకం పెరుగుతున్నందునే, ఇంతటి గిరాకీ లభిస్తోంది. వివిధ రకాల అవసరాలకు సరిపోయే ఈవీలను విస్తృత శ్రేణిలో అందిస్తున్నామని శ్రీవత్స తెలిపారు. ప్రస్తుత జోరు గమనిస్తే సెప్టెంబరు-డిసెంబరు త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఈవీగా టాటా నిలిచిందని స్పష్టం చేశారు.

- Advertisement -

కమర్షియల్‌ వెహికల్స్‌కూ ఫుల్‌ డిమాండ్‌..

తమ ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాల (సీవీల)లకూ డిమాండ్‌ పెరుగుతోందని అంచనా వేస్తున్నట్లు టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ గిరీష్‌ వాఘ్‌ తెలిపారు. చైనా నుంచి రావాల్సిన బ్యాటరీ సెల్స్‌ సరఫరాలో ఆటంకాల వల్ల తమ ఇంట్రా ఈవీపై ప్రభావం పడిందని అందువల్ల డెలివరీకి సమయం ఎక్కువగా పడుతుందన్నారు. సెప్టెంబరు చివరి నాటికి ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో ఇప్పటికీ ఈవీలకు మంచి డిమాండ్‌ ఉన్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కనిపించిన ఊపును కొనసాగిస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3,400కు పైగా విద్యుత్‌ వాణిజ్య వాహనాలకు ఆర్డర్లు లభించినట్లు వెల్లడించారు. ‘పీఎం-ఈబస్‌ సేవా’లో కొత్త టెండర్లు రాబోతున్నాయని, వాటిపైనా ఆశాభావంతో ఉన్నామని వాఘ్‌ వెల్లడించారు. పూర్తిగా రీటెయిల్‌ మార్కెట్‌లో ఉన్న చిన్న వాణిజ్య వాహనాల (ఎస్‌సీవీ) పికప్‌ విభాగం బాగా రాణిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా ఎలక్ట్రిక్‌ ఎస్‌సీవీల్లో 4 రెట్లకు పైగా వృద్ధి నమోదు చేసింది. సుమారు 3,200 వాహనాలు విక్రయించింది. కాగా, 850కి పైగా ఈవీ బస్సుల ఆర్డర్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News