Tata Motors News: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది ఎన్నడూ చూడని అతిపెద్ద అమ్మకాల సునామీని సృష్టించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపుప్రకటన తర్వాత అంటే నవరాత్రి నుంచి దీపావళి వరకు మెుత్తం పండుగ కాలంలో కంపెనీ ఏకంగా లక్ష కార్లను డెలివరీ చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో మారుతీ, హుందాయ్, టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ అమ్మకాల్లో సరికొత్త చరిత్రకు తెరలేపాయి.
దీంతో కేవలం 30 రోజుల కాలంలోనే టాటా మోటార్స్ అమ్మకాల గత ఏడాదితో పోల్చితే ఏకంగా 33 శాతం పెరుగుదలను చూశాయి. పండుగకు తోడు తగ్గిన పన్నులతో ఆటో లవర్స్ దీనిని మంచి సమయంగా భావించటమే టాటా అమ్మకాలకు కారణంగా వెల్లడైంది. ఈ ప్రభావం రానున్న త్రైమాసిక ఫలితాల్లో ప్రతిబింబిస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఇక అమ్మకాల పరంగా టాటా మోటార్స్ కంపెనీకి చెందిన టాటా నెక్సన్ అతిపెద్ద సేల్స్ చూడగా.. దీని తర్వాత టాటా పంచ్ కూడా మంచి అమ్మకాలతో టాటాలకు ఈ పండక్కి కాసుల వర్షం కురిపించాయి. భారతదేశంలో ఎస్ యూవీలకు ప్రజల నుంచి ఎక్కువ ఆధరణ ఉన్న క్రమంలోనే టాటా నెక్సన్ సేఫ్టీ, లుక్స్, కంఫర్ట్, ఫీచర్స్ తో పాటు ఇతర బెనిఫిట్స్ అమ్మకాలను భారీగా పుష్ చేసింది. ఈ మోడల్ డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉండటంతో భారతీయ వినియోగదారులకు విస్తృత శ్రేణి ఎంపికలను అందించింది. అలాగే మెుదటిసారి కారు కొనే వారి నుంచి ఎక్కువగా టాటా పంచ్ కార్లకు డిమాండ్ కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
చెప్పుకోతగ్గ మరో విషయం ఏంటంటే టాటా మోటార్స్ ఈ ఏడాది పండక్కి ఏకంగా 10వేల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మి కొత్త మైలురాయిని అందుకుంది. ప్రజలకు వాతావరణ మార్పులతో పాటు తక్కువ రన్నింగ్ ఖర్చులపై పెరుగుతున్న అవగాహన ఈవీల అమ్మకాలను పుష్ చేస్తోంది. పండక్కి అమ్మకాలు ఘనంగానే ఉన్నప్పటికీ తర్వాత కూడా ఇదే జోష్ అమ్మకాల్లో కొనసాగుతుందా.. జీఎస్టీ నిజంగానే బూస్టర్ డోస్ అవుతుందా అనే విషయాలు వేచిచూడాల్సిన అంశాలుగా నిపుణులు అంటున్నారు.


