Tata Motors Demerger: టాటా మోటార్స్ షేర్లు మంగళవారం అక్టోబర్ 14న ఒక్కసారిగా 40 శాతం పతనం కావటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళనలు చెలరేగాయి. అదేంటి రూ.660 దగ్గర ఉండాల్సిన రేటు రూ.390 దగ్గరకు పడిపోయిందని షాక్ అయ్యారు అసలు విషయం తెలియని చాలా మంది. అయితే దీనిపై ఆందోళనలు అస్సలు అవసరం లేదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు విషయానికి వస్తే.. వాస్తవానికి టాటా గ్రూప్ కంపెనీని ప్యాసింజర్ యూనిట్, కమర్షియల్ వాహనాల యూనిట్లుగా సపరేట్ చేయాలని నిర్ణయించింది. దీని కారణంగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కేవలం పాసింజర్ వాహనాల వ్యాపారాన్ని సూచిస్తోంది. దాని విలువకు తగినట్లుగానే షేర్ విలువ కూడా మార్చబడింది. త్వరలోనే కంపెనీ తన కమర్షియల్ వాహనాల వ్యాపార విభాగాన్ని సపరేట్ కంపెనీగా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయబోతోంది. అప్పుడు పెట్టుబడిదారులకు ఆ కంపెనీ విలువకు ఆధారంగా షేర్ల అలాట్మెంట్ ఉంటుందని వెల్లడైంది.
టాటా గ్రూప్ ఎవరైనా ఇన్వెస్టర్ టాటా మోటార్స్ కంపెనీలో 100 షేర్లను హోల్డ్ చేస్తున్నట్లయితే వారికి.. టాటా మోటార్స్ కంపెనీలో 100 షేర్లు అలాగే కొత్తగా రాబోతున్న టాటా కమర్షియల్ వెహికల్ లిమిటెడ్ కంపెనీలో మరో 100 షేర్లను అందిస్తోంది. ఇక్కడ సదరు వ్యాపారాలకు అనుగుణంగా మార్కెట్ క్యాప్ డివైడ్ చేయబడుతోందని కంపెనీ స్పష్టం చేసింది.
చాలా మంది ఇన్వెస్టర్లకు ఈ ఆర్ధిక సాంకేతిక పరిణామం తెలియకపోవడం వల్ల ప్యానిక్ ఏర్పడింది. సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా మంది ప్రజలు ఈ భారీ తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. కాని మార్కెట్ నిపుణులు ఇది ఒక సాధారణ సాంకేతిక సర్దుబాటు మాత్రమేనని.. దీన్ని నమ్మెుచ్చని చెప్పారు. జస్ట్ డీమెర్జర్ కారణంగా వచ్చిన మార్పుకు ఆందోళన వద్దని నిపుణులు పెట్టుబడిదారులకు చెబుతున్నారు. కంపెనీలు విడివిడిగా పోటీతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, కంపెనీ నాయకత్వ స్థాయిలో నిర్ణయాలు సమర్థవంతంగా తీసుకునేందుకు టాటా కంపెనీ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారుతుందని, భవిష్యత్తులో ఈ రెండు కంపెనీలు విడివిడిగా మంచి వృద్ధి దిశగా ప్రయాణించటానికి ఇది దోహదపడుతుందని వారు చెబుతున్నారు.


