Tesla India showroom launch: ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాలు భారత్ లోకి ప్రవేశించబోతున్నాయి. ప్రపంచానికి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసి, వాటిని ప్రధాన వాహనాలుగా మార్చిన కంపెనీ టెస్లా ఇప్పుడు భారత మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టనుంది. జూలై 15న ముంబయిలో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈ పరిణామం భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో కీలక మలుపుగా మారనుంది.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. అంతేకాదు, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వ ప్రోత్సాహం, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టెస్లా భారతదేశాన్ని కీలక మార్కెట్‌గా పరిగణిస్తోంది.
ఇప్పటికే టెస్లా మార్చిలో ముంబైలో ఒక ప్రైమ్ లొకేషన్‌లో షోరూమ్ కోసం లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది దేశంలో తన కార్యకలాపాలకు పునాది వేయడమే కాదు, మిగతా నగరాలకు విస్తరణకు తొలి అడుగుగా మారనుంది.
ముంబయికి చేరిన మొదటి టెస్లా కార్లు
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, టెస్లా ప్రస్తుతం చైనా షాంఘై ఫ్యాక్టరీలో తయారైన మోడల్ Y రియర్ వీల్ డ్రైవ్ SUVలను భారత్‌కు దిగుమతి చేసింది. మొదటగా ఐదు వాహనాలను ముంబయికి తీసుకొచ్చారు. ఒక్కో వాహనం సుమారు రూ. 27.7 లక్షలు ($31,988) విలువ కలిగి ఉండగా, ప్రతి కారుపై దాదాపు రూ. 21 లక్షల దిగుమతి సుంకం విధించబడింది. భారతదేశంలో $40,000 లోపు ధర కలిగిన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లపై 70% దిగుమతి సుంకం ఉండడం వల్ల ఈ అధిక పన్నులు ఉన్నాయి.
తర్వాతి టార్గెట్ ఢిల్లీ-ఎన్‌సీఆర్
టెస్లా ముంబయైలో తొలి షోరూమ్ ప్రారంభించనున్న తరువాత, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రెండో షోరూమ్ ఏర్పాటుపై కూడా దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో టెస్లా ఇప్పటికే భారత్‌లో కొన్ని కీలక ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఉద్యోగుల నియామకం, సర్వీస్ సపోర్ట్, టెస్ట్ డ్రైవ్ లాంటి సేవలతో దేశవ్యాప్తంగా మరిన్ని కేంద్రాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భవిష్యత్తులో “లోకల్ అసెంబ్లీ”పై దృష్టి
టెస్లా దీర్ఘకాలిక వ్యూహాల్లో భారతదేశంలో వాహనాల అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. దేశీయంగా వాహనాల తయారీ ప్రారంభిస్తే దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి. అదే సమయంలో మధ్యతరగతి వినియోగదారులకు కార్లు మరింత సరసమైన ధరకు అందుబాటులోకి వస్తాయి. ఇది దేశీయ ఉద్యోగ అవకాశాలకూ దోహదపడుతుంది.
టెస్లా ముంబయైలో షోరూమ్ ప్రారంభం ద్వారా భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో నూతన దిశ ఏర్పడనుంది. కంపెనీ ఇప్పటికే వాహనాలు దిగుమతి చేయడం, స్టోర్‌లు స్థాపించడం, ఉద్యోగ నియామకాలు మొదలుపెట్టడం వంటివి ప్రారంభించింది. ఇది తక్కువ కాలంలో దేశవ్యాప్తంగా టెస్లా సేవలు విస్తరించే దిశగా ఒక బలమైన సంకేతంగా నిలుస్తోంది.


