Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం ‘టెస్లా’ భారత విపణిలో తన పట్టును పెంచుకునేందుకు దూకుడు పెంచింది. గతేడాది భారత్‌లో అట్టహాసంగా అడుగుపెట్టినప్పటికీ, ఆశించిన స్థాయిలో విక్రయాలు నమోదు కాకపోవడంతో ఇప్పుడు సరికొత్త ‘డిస్కౌంట్ మ్యాజిక్’ను తెరపైకి తెచ్చింది. సామాన్యుడిని సైతం లగ్జరీ ఈవీ వైపు ఆకర్షించేలా భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్ట్ టెస్లా.. భారత రోడ్లపై తన వేగాన్ని పెంచేందుకు సిద్ధమైంది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా మోడల్ వై (Tesla Model Y) అమ్మకాలను పెంచే లక్ష్యంతో కంపెనీ ప్రస్తుతం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం.
ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 3 లక్షల లబ్ధి
మీ దగ్గర ఉన్న పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఇచ్చి సరికొత్త టెస్లా మోడల్ వై తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు రూ. 3 లక్షల వరకు భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను టెస్లా ఇండియా అందిస్తోంది. పాత కారు విలువకు అదనంగా ఈ ప్రోత్సాహకం లభించడం విశేషం.
also read Traffic Jam : ముంబై-పుణె రహదారిపై నరకం – ఖండాలా ఘాట్ వద్ద బోల్తా పడ్డ ట్యాంకర్!
రూ. 6 లక్షలతో ఇంటికి.. నెలకు రూ. 29 వేలకే సాధ్యమా?
టెస్లా ప్రకటించిన ఈఎంఐ ప్లాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.కేవలం రూ. 6 లక్షలు చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు.నెలకు రూ. 49,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.అయితే, పెట్రోల్/డీజిల్ ఖర్చులు మరియు మెయింటెనెన్స్ రూపంలో నెలకు సుమారు రూ. 20,000 ఆదా అవుతాయని కంపెనీ చెబుతోంది. ఈ లెక్కన వినియోగదారుడిపై పడే నికర భారం నెలకు కేవలం రూ. 29,000 మాత్రమే.
అమ్మకాల ఆకలి తీరేనా?
వాస్తవానికి, 2025లో టెస్లా భారత్‌లో కేవలం 225 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. రూ. 60 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన మోడల్ వై, బీఎండబ్ల్యూ మరియు బీవైడీ (BYD) వంటి గట్టి పోటీదారుల ముందు కొంత తడబడింది. బుకింగ్స్ భారీగా వచ్చినా, రిజిస్ట్రేషన్ల వరకు ఆ సంఖ్య చేరకపోవడంతో ఇప్పుడు ఈ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
టెస్లా వర్సెస్ మార్కెట్
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2024తో పోలిస్తే 2025లో 77 శాతం పెరిగాయి. అయినప్పటికీ, లగ్జరీ విభాగంలో టెస్లా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఇలాంటి రాయితీలు అవసరమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సరికొత్త ఆఫర్లు మార్చి 31, 2026 లోపు డెలివరీ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది.

