Friday, March 13, 2026
Homeబిజినెస్Trump : భారత్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్.. ఆయన లెక్క వేరే ఉంది బాసూ

Trump : భారత్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్.. ఆయన లెక్క వేరే ఉంది బాసూ

Trump Tariff Diplomacy: అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ శైలే వేరు. ఆయన నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. తాజాగా భారత్‌పై టారిఫ్‌లను (దిగుమతి సుంకాలను) గతంలో ఉన్న 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటన ప్రపంచ వేదికపై పెను సంచలనం సృష్టించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినప్పటికీ, ఈ తగ్గింపు వెనుక ఉన్న వ్యూహాత్మక రాజకీయాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చింది. మంగళవారం ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, నా ప్రాణ మిత్రుడు మోదీ కోరిక మేరకు అంటూ ట్రంప్ ఈ సుంకాల తగ్గింపును ప్రకటించారు. అయితే, అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ ఉచితంగా రాదు. ప్రతి స్నేహపూర్వక నిర్ణయం వెనుక ఒక పక్కా వ్యాపార లెక్క ఉంటుంది.

- Advertisement -

మారని ట్రంప్ మార్క్
ట్రంప్ రాజకీయ జీవితం మొత్తం అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే నడుస్తుంది. గతంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని ఆగ్రహించిన ట్రంప్, సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచి ‘పెనాల్టీ’ విధించారు. ఇప్పుడు ఆ సుంకాలను 18 శాతానికి తగ్గించడం ద్వారా భారత్‌ను రష్యా నుంచి దూరం చేసే దిశగా ఒక అడుగు వేశారు.

Sreeleela : వ‌రుస‌గా ఏడు ఫ్లాప్‌లు – అయినా మ‌రో బంప‌రాఫ‌ర్ కొట్టేసిన శ్రీలీల‌

 

రష్యా, చైనాలకు చెక్ పెట్టే వ్యూహం
ప్రస్తుతం అమెరికాకు రష్యా ఒక యుద్ధ సవాల్‌గా, చైనా ఒక ఆర్థిక సవాల్‌గా మారాయి. ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే భారత్ వంటి శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మద్దతు అమెరికాకు అత్యంత అవసరం.భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం మానేసి, అమెరికా , వెనిజులా నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాలన్నదే ట్రంప్ ప్రధాన షరతు. దీనివల్ల రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని అమెరికా భావిస్తోంది.ఈ ఒప్పందంలో భాగంగా భారత్ సుమారు 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 45.5 లక్షల కోట్లు) విలువైన అమెరికా ఉత్పత్తులను (చమురు, సాంకేతికత, బొగ్గు) కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

గ్లోబల్ పీస్ మేకర్ పాత్ర
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడమే తన లక్ష్యమని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. భారత్ రష్యాకు సన్నిహిత దేశం కాబట్టి, మోదీ ద్వారా రష్యాపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అందుకే భారత్‌కు సుంకాల తగ్గింపు ద్వారా ఒక ‘స్నేహ హస్తం’ అందిస్తూనే, తన అంతర్జాతీయ అజెండాను అమలు చేస్తున్నారు.

భారత్‌కు లాభమా? సవాలా?
టారిఫ్ తగ్గింపు వల్ల భారతీయ టెక్స్‌టైల్స్, జెమ్స్ & జ్యువెలరీ, ఐటీ సేవలకు భారీ లాభం కలుగుతుంది. అయితే, రష్యా నుంచి వస్తున్న చవక చమురును వదులుకుని, అమెరికా నుంచి ఖరీదైన ఇంధనాన్ని కొనడం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.అంతేకాకుండా, అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలను కూడా ‘సున్నా’ స్థాయికి తీసుకురావాలన్న ట్రంప్ ఒత్తిడి, దేశీయ పరిశ్రమలకు సవాలుగా మారే అవకాశం ఉంది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ట్రంప్ సుంకాల తగ్గింపు నిర్ణయం భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని తెరిచినప్పటికీ, దీని వెనుక ఉన్న ఆర్థిక భారాలను భారత్ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News