Two days work from home for HDFC employees: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయనున్నట్లు తెలిపింది. కాగా, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు సంక్షోభం తలెత్తడంతో ప్రధాని మోదీ ఇటీవల పొదుపు మంత్రం పాటించాలని, కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని పిలుపు మేరకు అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటిస్తుండగా.. ఇప్పడు హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఆ జాబితాలో చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ తన ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్‌లకు సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని, నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఆ తర్వాత సంస్థ పనితీరును సమీక్షించి ఈ విధానం మున్ముందు కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
Also Read: Bandi Sanjay: అందుకే నాపై కుట్ర.. కేటీఆర్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
వారికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇంటర్నల్ విభాగాలైన ట్రెజరీ ఆపరేషన్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్, డిజిటల్ బ్యాంకింగ్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ అకౌంట్స్ వంటి ఉద్యోగులకు మాత్రమే ఈ రెండు రోజుల వర్క్ ఫ్రం హోం విధానం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. బ్యాంకు కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని తెలిపింది. వారి విధులు యథావిధిగా కొనసాగుతాయని, వర్క్ ఫ్రం హోం వల్ల వినియోగదారులకు బ్యాంకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. తమ కస్టమర్లు యధావిథిగా సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది.

