Saturday, November 15, 2025
HomeTop StoriesVirat Kohli: వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న కింగ్

Virat Kohli: వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న కింగ్

Investments: క్రికెట్ ప్రపంచంలో సంచలనాలు సృష్టించి, లక్షలాది అభిమానుల గుండెల్లో ‘ఛేజ్ మాస్టర్’గా నిలిచిన విరాట్ కోహ్లీ… మైదానం బయట కూడా ఓ తెలివైన వ్యాపారవేత్తగా తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. తన 37వ ఏట ఈ దిగ్గజ క్రికెటర్ సృష్టించిన బిజినెస్ పోర్ట్‌ఫోలియో, అతని ఆటలో కనిపించేంత వ్యూహాత్మకంగా, దూరదృష్టితో ఉంది.

- Advertisement -

కోహ్లీ కేవలం ఒక ఆటగాడు కాదు; అతను ఒక బ్రాండ్, ఒక పెట్టుబడిదారుడు. తన క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్నా, ఆట తర్వాత కూడా స్థిరమైన, గణనీయమైన ఆదాయ వనరులను అందించేలా అతను తన వ్యాపార ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు.

కోహ్లీ అభిరుచి, జీవనశైలి అతని వ్యాపారంలో ప్రతిబింబిస్తాయి. 2017లో హాస్పిటాలిటీ రంగంలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన జెర్సీ నంబర్ 18 ఆధారంగా ‘వన్8 కమ్యూన్’ (One8 Commune) రెస్టారెంట్ చైన్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ప్యాషన్ హాస్పిటాలిటీ సంస్థలో పెట్టుబడి పెట్టడం ద్వారా అతను ఈ రంగాన్ని సొంతం చేసుకున్నాడు. ఆహార ఉత్పత్తుల విషయానికొస్తే, అతను సాఫ్ట్ డ్రింక్ తయారీదారు ఓషన్ డ్రింక్స్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ బ్లూ ట్రైబ్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. అంతేకాకుండా, ఇన్‌స్టంట్ ఫ్లేవర్డ్ కాఫీ ఉత్పత్తుల సంస్థ స్వాంభన్ కామర్స్లో ఏకంగా రూ.19 కోట్లు పెట్టుబడి పెట్టి, వినియోగదారుల ఉత్పత్తుల (FMCG)పై తనకున్న నమ్మకాన్ని చాటాడు.

క్రీడలపై తనకున్న మక్కువను వ్యాపారంగా మార్చడంలో కోహ్లీ ముందున్నాడు.ఇండియన్ సూపర్ లీగ్ (ISL) క్లబ్ FC గోవాలో వాటా కొనుగోలు చేయడం అతని మొట్టమొదటి ముఖ్యమైన వ్యాపార పెట్టుబడి. మొబైల్ గేమింగ్ కంపెనీ MPLలో భాగస్వామ్య హక్కులతో పాటు, 2025 మేలో వరల్డ్ బౌలింగ్ లీగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, కింగ్ ఫుట్‌బాల్, క్రికెట్ దాటి ఇతర క్రీడా విభాగాలపైనా తన దృష్టిని కేంద్రీకరించినట్టు స్పష్టమవుతోంది.

ఆన్‌లైన్ ఫ్యాషన్ మరియు రిటైల్ రంగంలో కోహ్లీ కీలక ముద్ర వేశాడు. కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్తో కలిసి 2020లో ప్రారంభించిన అతని సొంత బ్రాండ్ WROGN, యువతలో భారీ విజయాన్ని సాధించింది. ఇందులో అతను సుమారు రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టాడు. రిటైల్ మార్కెట్‌పై నమ్మకంతో, 2024 అక్టోబర్‌లో స్పోర్ట్స్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ Agilitasలో ₹58 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు.

సాంకేతికత, ఆర్థిక రంగాలపై కోహ్లీ ఆసక్తి అతని పెట్టుబడుల దూరదృష్టికి నిదర్శనం. భీమా రంగంలో ప్రముఖ సంస్థ గో డిజిట్ (Go Digit) లో 2020లోనే పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ 2024 మేలో ఐపీఓ (IPO) ప్రారంభించడం, కోహ్లీ సరైన సమయంలో సరైన ఎంపిక చేసుకున్నాడని నిరూపించింది. గతంలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘కూ’ (Koo) లో స్వల్ప వాటా కొనుగోలు చేసినప్పటికీ, అది కార్యకలాపాలు నిలిపివేసింది.

విరాట్ కోహ్లీ యొక్క ఈ పెట్టుబడులు.. రిస్క్‌ను తక్కువగా ఉంచుతూ, యువతకు ఆకర్షణీయంగా ఉండే రంగాలపై ఆయనకున్న పట్టును సూచిస్తున్నాయి. క్రికెట్ మైదానంలో ఛేజింగ్ టార్గెట్‌లు పూర్తి చేసినట్టే, వ్యాపార ప్రపంచంలో పెట్టుబడి టార్గెట్‌లను కూడా తెలివిగా ఛేదిస్తున్న విరాట్ కోహ్లీ, నేటి యువ క్రికెటర్లకు మరియు వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad