UPI transaction charges : కూరగాయల బండి నుంచి ఖరీదైన మాల్స్ వరకు.. దేశమంతా ‘స్కాన్ అండ్ పే’ మంత్రం జపిస్తోంది. మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిన యూపీఐ (UPI) చెల్లింపులు ఇకపై ఉచితం కాకపోవచ్చన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సేవల నిర్వహణకు అవుతున్న ఖర్చును ఎవరో ఒకరు భరించాలంటూ కేంద్ర ప్రభుత్వ కీలక అధికారి చేసిన వ్యాఖ్యలు పెను చర్చకు దారితీశాయి. ఇకపై ప్రతీ లావాదేవీపై పైసలు చెల్లించాల్సిందేనా..? ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు ఆలోచిస్తోంది..? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి..?
ఉచిత సేవలకు కాలం చెల్లనుందా : దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఉచిత సేవలకు కాలం చెల్లనుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ చెల్లింపుల వ్యవస్థను నిరంతరం ఉచితంగా అందించడం సాధ్యం కాదని, దాని నిర్వహణకు అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
సహేతుకమైన ఛార్జీలు విధించే అవకాశం : యూపీఐ వ్యవస్థ విజయవంతంగా నడవడానికి, దాని మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరచడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ప్రస్తుతం సబ్సిడీల రూపంలో భరిస్తోందని ఆయన గుర్తుచేశారు. బ్యాంకులు, థర్డ్-పార్టీ యాప్‌లు ఈ వ్యవస్థను నడపడానికి గణనీయంగా ఖర్చు చేస్తున్నాయని, అయితే ఎటువంటి ఆదాయం లేకుండా ఏ వ్యవస్థ అయినా దీర్ఘకాలం మనుగడ సాగించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణమే కాకపోయినా, భవిష్యత్తులో యూపీఐ సేవలపై సహేతుకమైన ఛార్జీలు విధించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే ఐసీఐసీఐ తొలి అడుగు: ఈ దిశగా ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసింది. అయితే, ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులకు కాకుండా, వ్యాపారులకు వర్తిస్తాయి. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా యూపీఐ లావాదేవీలు స్వీకరించే అగ్రిగేటర్ల నుంచి లావాదేవీ ఆధారిత ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. ప్రతి వంద రూపాయల లావాదేవీపై 2 పైసల వరకు, గరిష్టంగా ఒక లావాదేవీకి 6 రూపాయల వరకు ఈ ఛార్జీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వ్యాపారికి ఐసీఐసీఐ బ్యాంకులో ఎస్క్రో ఖాతా లేని పక్షంలో, ఈ గరిష్ట ఛార్జీ రూ.10 వరకు ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతా ఉన్న వ్యాపారులకు, అదే బ్యాంక్ ద్వారా జరిగే లావాదేవీలపై ఛార్జీలు ఉండవని బ్యాంక్ వెల్లడించింది.
ఈ పరిణామం, భవిష్యత్తులో ఇతర బ్యాంకులు, పేమెంట్ యాప్‌లు కూడా ఇదే బాట పట్టవచ్చన్న ఊహాగానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాలు, బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాలతో ఉచిత యూపీఐ శకం ముగింపు దశకు చేరుకుందా అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది.


