Venezuela oil to India: అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. వెనిజులాలోని భారీ చమురు నిల్వలపై పట్టు సాధించిన అమెరికా.. ఆ ముడి చమురును భారత్‌కు విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా నియంత్రణలో ఉండే ఒక సరికొత్త ట్రేడింగ్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా భారత్ ఇకపై వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. అంటే అమెరికా గుప్పిట్లో నుంచి వెనిజులా ఆయిల్ ఇండియాకు రానుందన్నమాట.
అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వెనిజులా క్రూడ్ ఆయిల్ అమ్మకాలన్నీ ఇకపై వాషింగ్టన్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. వెనిజులా చమురును తామే మార్కెట్ చేస్తామని.. దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా అమెరికా నియంత్రణలో ఉన్న ఖాతాల్లోకే వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధులను వెనిజులా ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, ఏ రకమైన అవినీతికి తావు లేకుండా చూస్తామని అంటూ కొత్త రాగం వినిపిస్తోంది అమెరికా.
also read Gold: 24క్యారెట్ ప్యూర్ గోల్డ్ కేవలం 181 రూపాయలు మాత్రమే!
భారత్‌కు ఎందుకంత ప్రాధాన్యత?
అమెరికా ఆంక్షలు విధించకముందు వెనిజులాకు భారత్ ఒక అతిపెద్ద కస్టమర్. భారత్‌లోని రిలయన్స్, నయారా వంటి దిగ్గజ రిఫైనరీలు వెనిజులా నుంచి వచ్చే హెవీ క్రూడ్ ను శుద్ధి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. అయితే ట్రంప్ ప్రభుత్వం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఇండియాకు పదేపదే హెచ్చరిస్తున్న వేళ.. వెనిజులా చమురు భారత్‌కు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.
ట్రంప్ బిలియన్ డాలర్ ప్లాన్..
మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి దింపేసిన తర్వాత.. వెనిజులా చమురు రంగాన్ని పునరుద్ధరించేందుకు దాదాపు 100 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.9 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమని ట్రంప్ అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అమెరికన్ చమురు దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం వెనిజులాలో నిల్వ ఉన్న 30 నుంచి 50 మిలియన్ బారెళ్ల క్రుడాయిల్ వెంటనే మార్కెట్లోకి విడుదల చేయాలని అమెరికా భావిస్తోంది. మెుత్తానికి అమెరికాకు ఎదురుతిరుగుతున్న వెనిజులాను ట్రంప్ తన గుప్పిట్లోకి తెచ్చుకుని అక్కడి ఇంధన వనరులను అమెరికా కంపెనీల చేతికి అప్పగించే పనిలో చాలా బిజీబిజీగా ఉన్నట్లు ప్రస్తుత పరిణామాల ప్రకారం అర్థం అవుతోందని నిపుణులు అంటున్నారు. అయితే ఇది కొంత భారతదేశానికి ఎనర్జీ క్రైసిస్ కలగకుండా కూడా ఉపయోగకరంగా మారబోతోంది.

