Vaibhav in musks new america party : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్థాపించిన కొత్త రాజకీయ పార్టీ “అమెరికా పార్టీ”లో భారత సంతతికి చెందిన వ్యక్తి వైభవ్ తనేజా కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. వైభవ్ ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా చేస్తున్నాడు. మస్క్ ఈ పార్టీని అధికారికంగా ప్రారంభించిన కొద్దికాలానికే వైభవ్‌ను పార్టీ కోశాధికారిగా మరియు రికార్డుల సంరక్షకుడిగా నియమించారు. ఇది వైభవ్‌కు రాజకీయ రంగంలో ఒక ప్రధాన మలుపు మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించినట్లయింది. వైభవ్ తనేజా 2024లో ఏకంగా $139 మిలియన్లు (దాదాపు రూ. 1,157 కోట్లు) సంపాదించడంతో ప్రపంచంలోని ఏ సిఎఫ్ఒ (CFO)కు లేనంత అధిక ఆదాయం పొందిన వ్యక్తిగా నిలిచారు. ఈ మొత్తం మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల మరియు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వేతనాలను మించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
వైభవ్ తనేజా కెరీర్
వైభవ్ తనేజా కెరీర్ టెస్లాలో 2017లో ప్రారంభమైంది. కానీ అప్పటికే ఆయనకు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (PwC) సంస్థలో భారతదేశం మరియు అమెరికాలో కలిపి 17 సంవత్సరాల అనుభవం ఉంది. మస్క్ స్థాపించిన సోలార్ సిటీలో కూడా ఆయన ఒక సంవత్సరం పనిచేశారు. 2017 సంవత్సరంలో టెస్లాలో అసిస్టెంట్ కార్పొరేట్ కంట్రోలర్‌గా చేరారు. 2018 సంవత్సరంలో కార్పొరేట్ కంట్రోలర్‌గా పదోన్నతి పొందారు. 2019 సంవత్సరంలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్, 2021లో టెస్లా ఇండియా డైరెక్టర్, 2023 ఆగస్టులో టెస్లా CFOగా నియామకం అయ్యారు.
మస్క్ కొత్త పార్టీ ఎందుకు..
డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ తన కొత్త పార్టీని ప్రకటించారు. మస్క్ ప్రకారం, రిపబ్లికన్లు మరియు డెమొక్రాట్ల పరిపాలన పట్ల అసంతృప్తిగా ఉన్న 80% అమెరికన్లకు ప్రతినిధిగా ఈ పార్టీ నిలవనుంది. ట్రంప్ ప్రవేశపెట్టిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” పై మస్క్ తీవ్రంగా విమర్శలు చేశారు. మస్క్ అభిప్రాయం ప్రకారం, ఈ బిల్లు $3 ట్రిలియన్ల మేర అమెరికా బడ్జెట్ లోటును పెంచుతుందని చెప్పారు. దీని తర్వాత ట్రంప్, మస్క్ కంపెనీలైన టెస్లా మరియు స్పేస్ ఎక్స్ పై సబ్సిడీలు నిలిపివేస్తానని బెదిరించడమే, మస్క్ పార్టీ స్థాపనకు ప్రేరణగా నిలిచింది.
వైభవ్ తనేజా కొత్త బాధ్యతలు ఏమిటి?
పార్టీలో కోశాధికారిగా వైభవ్ బాధ్యతలు చాలా కీలకమైనవి. ఆయన పార్టీకి ఆర్థిక వ్యూహాలు రూపొందించాలి. దీనిలో పార్టీ వార్షిక బడ్జెట్ సిద్ధం చేయడం, ఆదాయం–ఖర్చుల మానిటరింగ్, విరాళాలు, నిధుల సేకరణకు వ్యూహాలు తయారు చేయడం వంటి ఉంటాయి. పార్టీ లావాదేవీలు సరైనవిగా ఉండేలా పర్యవేక్షించడం, ఆర్థిక నష్టాల నివారణ చర్యలు చేపట్టడం కూడా ఉన్నాయి. ఇవి అన్ని కూడా ఒక రాజకీయ పార్టీ విజయానికి మూలస్తంభాలుగా మారుతాయి. పైగా అమెరికా వంటి సమర్థ రాజకీయ వ్యవస్థలో, భారతీయుడైన వైభవ్‌కు ఇలాంటి కీలక బాధ్యత దక్కడం గర్వకారణం అని చెప్పాలి.


