Vida VX2 Go Electric Scooter: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థ వీడా తమ VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొత్తగా విడా వీఎక్స్2 గో 3.4 kWh (VIDA VX2 Go 3.4 kWh) వేరియంట్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ధర:
తయారీదారు కొత్త వేరియంట్ కోసం ర్.1.02 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను నిర్ణయించారు. ఇది BaaSతో కూడా వస్తుంది. ఇందులో రూ.60,000 డౌన్ పేమెంట్, కిలోమీటరుకు 90 పైసల తదుపరి చెల్లింపు ఉంటుంది. ఈ స్కూటర్ విడా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
ఫీచర్లు:
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 3.4 kWh బ్యాటరీ, అనేక అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇది డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీలతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ఈ మోటార్ 26 న్యూటన్ మీటర్ల టార్క్, 6 కిలోవాట్ల శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా సామర్థ్యాన్ని, ప్రతిస్పందనను నియంత్రించుకోవడానికి వీలుగా ఇందులో ఎకో, రైడ్ మోడ్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను అందించారు. తయారీదారు ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, విశాలమైన సీటు, 27.2 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌ను కూడా ఈ స్కూటర్ కలిగి ఉంది.
అధికారులు ఇలా అన్నారు
హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసల్య నంద్‌కుమార్ మాట్లాడుతూ.. విడా ఎల్లప్పుడూ పురోగతికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆవిష్కరణ, ఫంక్షనాలిటీని మిళితం చేసి భారతీయ రైడర్ల జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కొత్త VX2 Go 3.4 kWh స్కూటర్ రోజువారి ప్రయాణంలో ఎక్కువ పరిధి, సామర్థ్యాన్ని కోరుకునే వారిని, పనితీరు, ఆచరణాత్మకత, ప్రయోజనం గురించి ఆలోచించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందింది. భారతదేశాన్ని శుభ్రమైన, మెరుగైన రేపటి వైపు నడిపించడానికి మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది అని వివరించారు.


