Vijay Mallya Vs Banks: భారత బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు చేసి, దేశం విడిచి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఆస్తుల విక్రయం ద్వారా బ్యాంకులు రికవరీ చేసుకున్న భారీ మొత్తాల వివరాలను రహస్యంగా ఉంచుతున్నాయని మాల్యా తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో మోసంతో పాటు, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా, మార్చి 2016 నుంచి యూకేలోనే నివసిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆయనను రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మాల్యా ప్రధాన ఆరోపణ:
భారత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే పార్లమెంట్‌కు ఇచ్చిన సమాచారంలో, మాల్యా ఆస్తుల విక్రయం ద్వారా సుమారు రూ.14,100 కోట్లు రికవరీ అయినట్లు స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు మాత్రం ఈ అధికారిక రికవరీ వివరాలను బయటపెట్టకపోవడం సిగ్గుచేటని మాల్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. “పూర్తి రికవరీ వివరాలను అధికారికంగా వెల్లడించే వరకు నేను యూకేలో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోను,” అని మాల్యా తేల్చి చెప్పారు.
రుణం కంటే ఎక్కువ చెల్లింపు?
కింగ్‌ఫిషర్ కోసం తాను తీసుకున్న రుణం దాదాపు రూ.9,000 కోట్లు కాగా, బ్యాంకులు తన నుంచి ఇప్పటికే అనేక రెట్లు ఎక్కువ వసూలు చేశాయని మాల్యా వాదిస్తున్నారు. తన తరఫు న్యాయవాదులు గతంలోనే రికవరీ అధికారి ద్వారా దాదాపు రూ.10,200 కోట్లు చెల్లించినట్లు ప్రకటించారు. తాను మొత్తం రుణం చెల్లించినప్పటికీ, ఇంకా రికవరీ ప్రక్రియను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ మాల్యా ప్రశ్నించారు. ఈ రికవరీల పూర్తి అకౌంట్ స్టేట్‌మెంట్‌లను అందించాలని కోరుతూ మాల్యా ఇటీవల కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారం న్యాయ, రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది.


