Warren Buffett retirement : కార్పొరేట్ ప్రపంచంలో ఓ శకం ముగిసింది. పెట్టుబడుల మాంత్రికుడు, ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా ప్రపంచ ఖ్యాతి గాంచిన వారెన్ బఫెట్, తాను ఆరు దశాబ్దాల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న బెర్క్‌షైర్ హ్యాథవే సంస్థ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. 95 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ఆయన వీడ్కోలు పలుకుతున్న వేళ, ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో ఓ అద్భుత అధ్యాయానికి తెరపడింది
ఒక వస్త్ర పరిశ్రమ నుంచి.. రూ.89 లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు : వారెన్ బఫెట్ ప్రస్థానం ఓ అద్భుతం.1965లో, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఓ చిన్న వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్ మిల్)గా ఉన్న బెర్క్‌షైర్ హ్యాథవేను ఆయన కొనుగోలు చేశారు. ఆ కంపెనీని గాడిన పెట్టడమే కాకుండా, దాని ద్వారా వచ్చే నగదును బీమా, రైలుమార్గాలు, విద్యుత్, కన్జూమర్ బ్రాండ్ల వంటి రంగాల్లోకి వ్యూహాత్మకంగా మళ్లించారు. ఆయన దీర్ఘకాలిక, క్రమశిక్షణాయుత పెట్టుబడి విధానం అద్భుతాలు సృష్టించింది. యాపిల్, కోకాకోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ కంపెనీలలో ఆయన పెట్టిన పెట్టుబడులు, బెర్క్‌షైర్ హ్యాథవే మార్కెట్ విలువను ఏకంగా రూ.89 లక్షల కోట్లకు చేర్చాయి.
ఆయన ఏటా నిర్వహించే వాటాదారుల సమావేశానికి ప్రపంచం నలుమూలల నుంచి ఇన్వెస్టర్లు తరలివస్తారు. ఆయన విడుదల చేసే వార్షిక లేఖ, పెట్టుబడిదారులకు ఓ భగవద్గీత లాంటిది. ఇకపై ఆ అవకాశం ఉండదు.
కొత్త సారథి.. గ్రెగ్ అబెల్ : వారెన్ బఫెట్ స్థానంలో, బెర్క్‌షైర్ హ్యాథవే నూతన సీఈఓగా కెనడాకు చెందిన వ్యాపారవేత్త గ్రెగ్ అబెల్ 2026 జనవరి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. అబెల్ 2000 సంవత్సరంలో బెర్క్‌షైర్ హ్యాథవేకు చెందిన ఓ అనుబంధ సంస్థలో చేరి, అంచెలంచెలుగా ఎదిగి, 2018 నాటికి సంస్థలోని ఇంధన, బీమాయేతర విభాగాలకు వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అబెల్ పనితీరు, దక్షతను గుర్తించిన వారెన్ బఫెట్, తన తర్వాత సంస్థను నడిపించగల సమర్థుడు అతడేనని 2025 మే నెలలోనే ప్రకటించారు.
అబెల్ ముందున్న అగ్నిపరీక్ష : బఫెట్ వారసత్వాన్ని అందుకోవడం గ్రెగ్ అబెల్‌కు కత్తిమీద సామే. ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. స్తుతం బెర్క్‌షైర్ హ్యాథవే వద్ద సుమారు రూ.34 లక్షల కోట్ల భారీ నగదు నిల్వలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, సరైన అవకాశాల కోసం బఫెట్ ఈ నగదును సిద్ధంగా ఉంచేవారు. ఈ భారీ మొత్తాన్ని బఫెట్ తరహాలోనే వ్యూహాత్మకంగా, లాభదాయకంగా పెట్టుబడులుగా మార్చడం అబెల్ ముందున్న అతిపెద్ద సవాల్. బఫెట్ శకం ముగిసినా, ఆయన పెట్టుబడి తత్వశాస్త్రం, ఆయన నిర్మించిన సామ్రాజ్యం నిలిచే ఉంటాయి. ఇప్పుడు అందరి దృష్టీ, ఈ వారసత్వాన్ని గ్రెగ్ అబెల్ ఎలా ముందుకు తీసుకెళ్తారన్న దానిపైనే నిలిచింది.

