Nikhil Kamath’s ‘People by WTF’ Podcast Trailer Featuring Elon Musk: భారతీయ ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసే వార్త ఇది. జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) ఎవరూ ఊహించని అతిథిని తన షోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)తో నిఖిల్ కామత్ జరిపిన సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్. నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న ‘People by WTF’ పాడ్‌కాస్ట్ కోసం మస్క్‌తో జరిపిన ఇంటర్వ్యూ తాలూకు ట్రైలర్ (Trailer) ఆదివారం విడుదలైంది.
బ్లాక్ అండ్ వైట్ వీడియోలో ఆసక్తికర సంభాషణ
సుమారు నిమిషంన్నర నిడివి ఉన్న ఈ ప్రోమో వీడియోను బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో విడుదల చేశారు. ఇందులో ఇద్దరూ ఒక ఆఫీసు వాతావరణంలో కాఫీ తాగుతూ ముచ్చటించుకోవడం కనిపిస్తుంది. సంభాషణ చాలా సరదాగా మొదలైంది. “నేను అనుకున్నదాని కంటే మీరు చాలా పెద్దగా, కండలు తిరిగి (Muscular) ఉన్నారు” అని నిఖిల్ కామత్ అనగానే మస్క్ గట్టిగా నవ్వేశారు. ఆ తర్వాత వారి చర్చ ‘మ్యాట్రిక్స్’ (Matrix) సినిమా వైపు మళ్లింది. “మీరు మ్యాట్రిక్స్ సినిమాలో ఏదైనా పాత్ర పోషించాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు?” అని నిఖిల్ అడగ్గా, “ఏజెంట్ స్మిత్ కాకూడదని కోరుకుంటున్నా” అని మస్క్ చమత్కరించారు. ఆంగ్ల అక్షరం ‘X’ మీద మస్క్‌కు ఉన్న ఇష్టాన్ని కూడా ఈ ట్రైలర్‌లో ప్రస్తావించారు. 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దానికి ‘X’ అని పేరు మార్చిన సంగతి తెలిసిందే.
Here’s to delaying gratification. The future belongs to the patient.@elonmusk pic.twitter.com/Z3QiunfCK3
— Nikhil Kamath (@nikhilkamathcio) November 30, 2025
నెటిజన్ల రియాక్షన్: ఇది కదా క్రేజీ అప్‌డేట్!
ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “జీటీఏ-6 (GTA 6) గేమ్ కంటే ముందే మనం ఈ ఇంటర్వ్యూ చూస్తున్నాం” అని ఒకరు, “నిఖిల్ కామత్ భారతీయ పాడ్‌కాస్ట్ స్థాయిని మార్చేశారు” అని మరొకరు కామెంట్ చేశారు. గతంలో నిఖిల్ కామత్ తన షోలో బిల్ గేట్స్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రణబీర్ కపూర్ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఎలాన్ మస్క్‌ను తీసుకురావడం ద్వారా ఆ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
మొదట ఏఐ (AI) వీడియో అనుకున్నారు!
అయితే, ఈ పూర్తి ట్రైలర్ రాకముందు శుక్రవారం సాయంత్రం నిఖిల్ ఒక చిన్న టీజర్ వదిలారు. అది చూసి చాలామంది ఇది నిజం కాదని, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో అని భ్రమపడ్డారు. మస్క్‌కు చెందిన ‘గ్రోక్’ (Grok) అనే ఏఐ చాట్‌బాట్ కూడా ఇది ఫేక్ వీడియో అని చెప్పడం గమనార్హం. “ముఖ కవళికలు అసహజంగా ఉన్నాయి, ఇది ఏఐ క్రియేషన్” అని గ్రోక్ తేల్చింది. కానీ ఇప్పుడు పూర్తి ట్రైలర్ రావడంతో అది నిజమైన ఇంటర్వ్యూ అని నిర్ధారణ అయ్యింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ “భవిష్యత్తు ఓపిక ఉన్నవారికే సొంతం” అని నిఖిల్ క్యాప్షన్ ఇచ్చారు.
ALSO READ: AI Job Loss: రాబోయే పదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలకు ఎసరు.. AI ధాటికి ఆ రంగాలు కనుమరుగు!

