Good News to WazirX Investors: తాజాగా సింగపూర్ హైకోర్టు క్రిప్టో ఎక్స్చేంజ్ వజిర్‌ఎక్స్ (WazirX) పునర్నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. దీంతో ఈ భారతీయ డిజిటల్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి మార్గం సుగమమైంది.గత ఏడాదిలో కంపెనీ వాలెట్లపై జరిగిన భారీ సైబర్ దాడి తర్వాత సేవలను కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇన్వెస్టర్లు తమ పోయిన డబ్బు గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తాజా వార్త వచ్చింది. అలాగే బాంబే హైకోర్టు కూడా కాయిన్ స్విచ్ నిధులకు వజిర్ఎక్స్ సంస్థనే బాధ్యురాలిగా తేల్చిన కొన్ని రోజులకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వజిర్‌ఎక్స్ మాతృసంస్థ అయిన Zettai Pte. Ltd. ప్రతిపాదించిన “స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్”కు సింగపూర్ హైకోర్టు మోడిఫికేషన్లతో అనుమతి ఇచ్చింది. మొత్తం 95.7 శాతం మంది క్రెడిటార్స్, 94.6 శాతం విలువ పరంగా ఈ పథకాన్ని మద్దతు ఇచ్చారు.అసలు ప్రస్తుత పరిస్థితులకు కారణం 2024 జూలైలో వజిర్‌ఎక్స్ హ్యాక్‌కు గురై సుమారు 235 మిలియన్ డాలర్ల విలువైన వినియోగదారుల ఆస్తులను కోల్పోవటమే. ఈ దాడి వెనుక నార్త్ కొరియా బేస్డ్ లజరస్ గ్రూప్ ఉందని అంతర్జాతీయ దర్యాప్తులు సూచించాయి. ఈ సంఘటన తర్వాత వజిర్‌ఎక్స్ ట్రేడింగ్, డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.
సింగపూర్ హైకోర్టు ఆమోదంతో వజిర్‌ఎక్స్ ఇప్పుడు తన రికవరీ ప్రణాళికను చట్టబద్ధంగా అమలు చేయగలదు. కోర్టు నిబంధనలు అమల్లోకి వచ్చిన 10 పని రోజులలోపుగా ప్లాట్‌ఫామ్ సేవలను తిరిగి ప్రారంభించనుంది. వినియోగదారుల నష్టపోయిన నిధులను తిరిగి చెల్లించడానికి ప్రత్యేక ఫండ్ రికవరీ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తామని సంస్థ తెలిపింది. వినియోగదారులు తమ ఖాతా వివరాలు, KYC ధృవపత్రాలు సమర్పించడం ద్వారా రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది.
దీనికి తోడు వజిర్‌ఎక్స్ ఇకపై తన ఫ్లాట్ ఫారమ్ భద్రత కోసం అమెరికాకు చెందిన బిట్‌గో (BitGo) సంస్థతో భాగస్వామ్యం చేసుకోనుంది. ఇది భవిష్యత్‌లో నిధుల భద్రతను బలోపేతం చేయనుంది. ఈ ఆమోదం వజిర్‌ఎక్స్‌ను దివాలా ప్రమాదం నుంచి రక్షించటమే కాకుండా.. వినియోగదారుల, అప్పుదారుల నమ్మకాన్ని పునరుద్ధరించే దిశగా కీలక మైలురాయిగా పేర్కొనబడింది. కోర్టు తీర్పుపై వజిర్ఎక్స్ వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


