Friday, March 13, 2026
Homeబిజినెస్Silver : వెండి విశ్వరూపం..ఒక్క నెలలోనే లక్షకుపైగా పెరిగిన ధర

Silver : వెండి విశ్వరూపం..ఒక్క నెలలోనే లక్షకుపైగా పెరిగిన ధర

Silver price: ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు బంగారం పెరుగుతుంటే వెండి నెమ్మదిగా వెనుకే నడిచేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వెండి పరుగు చూస్తుంటే చిరుతపులి కూడా తలవంచుకోవాల్సిందే. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 30,000 రూపాయలు పెరగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అసలు వెండికి ఎందుకింత ఆకలి పెరిగింది? లక్షల మార్కును ఇంత వేగంగా ఎలా దాటేస్తోంది?

- Advertisement -

నెల రోజుల మేజిక్!
వెండి ప్రయాణం గమనిస్తే అది ఎంతటి దూకుడుగా ఉందో అర్థమవుతుంది. కిలో వెండి ధర 1 లక్ష రూపాయల నుండి 2 లక్షల రూపాయలకు చేరుకోవడానికి దాదాపు 14 నెలల సమయం పట్టింది. కానీ, 2 లక్షల నుండి 3 లక్షల మార్కును తాకడానికి కేవలం ఒక్క నెల మాత్రమే పట్టిందంటే నమ్మగలరా?

జనవరి 19: కిలో వెండి ధర రూ. 3.18 లక్షలు.

జనవరి 20: మరుసటి రోజే రూ. 3.40 లక్షలకు జంప్.

జనవరి 21: నేడు ఏకంగా రూ. 3,45,000 వద్ద ట్రేడవుతోంది.

2025 ఏడాది మొత్తంలో దాదాపు 170% వృద్ధిని నమోదు చేసి, ఇన్వెస్టర్ల పాలిట ‘తెల్ల బంగారం’గా మారింది.

ధరలు మంట పుట్టించడానికి అసలు కారణాలేంటి?
వెండి ధర ఇలా ఆకాశాన్ని తాకడానికి ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక సమీకరణాలే ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్‌పై సుంకాలు విధిస్తామన్న హెచ్చరికలు అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా వెండిని ఎంచుకుంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు వెండికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఇది కేవలం నగలకు మాత్రమే పరిమితం కాదు. నేటి ఆధునిక కాలంలో సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండి పాత్ర కీలకం. డిమాండ్ పెరుగుతుంటే, గనుల నుంచి సరఫరా మాత్రం తక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.

ముందుంది ముసళ్ల పండుగేనా?
ధరలు ఇంత వేగంగా పెరగడంపై నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆగ్‌మాంట్ నివేదిక ప్రకారం, ఈ భారీ పెరుగుదల తర్వాత కొంత కాలం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. అంటే, పెరిగిన ధరల వద్ద ఇన్వెస్టర్లు తమ వెండిని విక్రయించి లాభాలు పొందాలని చూస్తే, ధర కొంత మేర తగ్గొచ్చు.బహుశా కిలో వెండి ధర తిరిగి రూ. 2,60,000 మార్కుకు దిగి రావచ్చని, ఆ తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొనేవారు కాస్త ఆచితూచి అడుగు వేయడం ఉత్తమమని విశ్లేషకుల మాట. వెండి ఇప్పుడు కేవలం లోహం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక తుపాను. సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తున్న ఈ వెండి వెలుగులు, మున్ముందు ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News