Homeబిజినెస్Wipro : విప్రో ఉద్యోగులకు బిగ్ షాక్ ..ఆఫీసులో ఉండాల్సిందే.. హుకుం జారీ

Wipro : విప్రో ఉద్యోగులకు బిగ్ షాక్ ..ఆఫీసులో ఉండాల్సిందే.. హుకుం జారీ

Work from Home : ఐటీ రంగంలో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కబుర్లు కనుమరుగవుతున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro) తన ఉద్యోగులకు కొత్త ఏడాది గట్టి షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ వర్క్ విధానంలో తీసుకొచ్చిన పెను మార్పులు ఇప్పుడు టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆఫీసుకి రావడం మాత్రమే కాదు, అక్కడ ఎంతసేపు ఉంటున్నారనేది కూడా లెక్కగట్టే సరికొత్త నిబంధనల వెనుక ఉన్న అసలు కథ ఇదే.

- Advertisement -

విప్రో టెక్కీలకు కొత్త రూల్స్
కొత్త ఏడాది, కొత్త లక్ష్యాలు అంటారేమో కానీ విప్రో మాత్రం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రూల్స్ ప్రకారం, విప్రో ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు గడప తొక్కాల్సిందే. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టింది సంస్థ. కేవలం వచ్చి వెళ్లడం కుదరదు.. ఆఫీసులో అడుగు పెట్టినప్పటి నుండి బయటకు వచ్చే వరకు కనీసం 6 గంటల సమయం అక్కడ గడపడం తప్పనిసరి.

సగం రోజు సెలవుపై వేటు
ఈ నిబంధన ఎంత కఠినంగా ఉందంటే.. ఒకవేళ ఏదైనా రోజు మీరు ఆఫీసుకి వెళ్లి, 6 గంటల కంటే ఒక్క నిమిషం తక్కువ ఉన్నా, అది పూర్తి పనిదినంగా పరిగణించబడదు. ఆ రోజుకు గాను మీ సెలవుల ఖాతా (Leave Balance) నుండి సగం రోజు (Half-day) కోత విధిస్తారు. ఈ నిబంధనతో సుమారు 2.34 లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు సమయం లెక్క చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రిమోట్ వర్క్ పైనా పరిమితులు
గతంలో విప్రో తన ఉద్యోగులకు ఏడాదికి 15 రోజుల పాటు ఇంటి నుండి పని చేసుకునే వెసులుబాటు కల్పించేది. ఇప్పుడు ఆ పరిమితిని 12 రోజులకు తగ్గించేసింది. ఈ సెలవులను కూడా కేవలం అత్యవసర పరిస్థితుల్లో.. అంటే అనారోగ్యం లేదా కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.

9.5 గంటల పని.. 6 గంటల ఆఫీసు
ఉద్యోగులకు పంపిన అంతర్గత ఇమెయిల్‌లో విప్రో యాజమాన్యం కొన్ని కీలక విషయాలను స్పష్టం చేసింది. ఆఫీసులో ఉండాల్సిన 6 గంటలు కేవలం ‘భౌతిక హాజరు’ కోసం మాత్రమే. మొత్తం పని గంటలు ఇప్పటికీ రోజుకు 9.5 గంటలే. ఆఫీసులో 6 గంటలు పూర్తి చేసిన తర్వాత, మిగిలిన సమయాన్ని ఉద్యోగులు ఇంటికి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. సహకారం పెరగడానికి, ప్రాజెక్టుల వేగవంతమైన డెలివరీకి ఈ నిర్ణయం తప్పనిసరి అని సంస్థ అభిప్రాయపడింది.

 

Gold Rate: తగ్గిన వెండి.. పెరిగిన బంగారు ధరలు.. హైదరాబాద్ రేట్లు ఇలా..

 

ఎందుకీ మార్పు
ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రవేశించాక పరిస్థితులు వేగంగా మారిపోయాయి. గతంలో ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి నెలలు, ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు వారాల్లోనే డెలివరీ ఇవ్వాల్సి వస్తోంది. ఇలాంటి వేగవంతమైన వాతావరణంలో టీమ్ సభ్యులంతా ఒకే చోట ఉండి చర్చించుకోవడం అత్యవసరమని కంపెనీలు భావిస్తున్నాయి. కేవలం విప్రో మాత్రమే కాదు.. ఇప్పటికే TCS, ఇన్ఫోసిస్ వంటి ఇతర దిగ్గజాలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసు బాట పట్టించాయి. మొత్తానికి ఐటీ రంగంలో బెడ్ రూమ్ టూ బోర్డ్ రూమ్ ప్రయాణానికి ఇక తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

టెక్ ప్రపంచంలో వస్తున్న ఈ మార్పులు ఉద్యోగుల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? టెక్కీలు మళ్లీ ఆఫీసులకే పరిమితం కావడం సరైనదేనా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News