Saturday, November 15, 2025
Homeబిజినెస్Zero GST: ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దు: మీ ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసా?

Zero GST: ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దు: మీ ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసా?

Zero GST on Health Insurance: సామాన్యుల జీవితానికి భద్రత కల్పించే ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు శుభవార్త! 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి, దానిని సున్నా శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం 2025, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పు వల్ల బీమా పాలసీలు మరింత అందుబాటులోకి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ప్రస్తుత పరిస్థితి – అధిక భారం
ఇప్పటివరకు, ఒక పాలసీదారు రూ. 100 ప్రీమియం చెల్లిస్తే, దానిపై 18% జీఎస్టీ కలిపి మొత్తం రూ. 118 చెల్లించాల్సి వస్తోంది. ఈ అదనపు భారం చాలా మందిని బీమా పాలసీలు తీసుకోవడానికి వెనకడుగు వేసేలా చేసింది. బీమాను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, జీఎస్టీని తగ్గించాలని చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా, జీరో జీఎస్టీ నిర్ణయంతో ఈ డిమాండ్ నెరవేరింది. ఇకపై అన్ని వ్యక్తిగత యూలిప్ (ULIP) ప్లాన్‌లు, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లు, టర్మ్ ప్లాన్‌లకు కూడా జీఎస్టీ మినహాయింపు లభించనుంది.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) అంటే ఏమిటి?
బీమా ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయడం ఎంత మంచిదో, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం, బీమా సంస్థలు మన నుండి 18% జీఎస్టీ వసూలు చేస్తాయి. కానీ, అదే సమయంలో వారు ఏజెంట్ కమిషన్, మార్కెటింగ్, కార్యాలయాల అద్దె వంటి అనేక కార్యకలాపాలపై కూడా జీఎస్టీ చెల్లిస్తారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం, వారు కస్టమర్ల నుండి వసూలు చేసిన జీఎస్టీని, తాము చెల్లించిన జీఎస్టీతో సర్దుబాటు చేసుకోవచ్చు. దీనినే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు.

ఉదాహరణకు, ఒక బీమా సంస్థ రూ. 100 ప్రీమియం వసూలు చేస్తే, వారు రూ. 18 జీఎస్టీని సేకరిస్తారు. అదే సమయంలో, వారు తమ కార్యకలాపాలకు రూ. 70 ఖర్చు చేస్తే (అద్దె, కమిషన్ వంటివి), దానిపై వారు చెల్లించిన 18% జీఎస్టీ అంటే రూ. 12.60ని తిరిగి పొందుతారు. అప్పుడు, వారు ప్రభుత్వానికి కేవలం రూ. 5.40 మాత్రమే చెల్లించాల్సి వస్తుంది.

జీరో జీఎస్టీతో లాభమా? నష్టమా?
ఇప్పుడు, ప్రీమియంపై జీఎస్టీ జీరో అయింది కాబట్టి, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) లభించదు. అంటే, తమ కార్యకలాపాలపై చెల్లించిన జీఎస్టీని తిరిగి పొందే అవకాశం ఉండదు. ఈ భారాన్ని కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాజీ ఎల్‌ఐసీ డైరెక్టర్ అశ్విన్ ఘాయ్ ప్రకారం, ఈ అదనపు భారం ప్రీమియంపై సుమారు 3.31% వరకు పెరగొచ్చు.

అయినప్పటికీ, జీరో జీఎస్టీ, జీరో ఐటీసీ మోడల్ వల్ల కూడా కస్టమర్లకు లబ్ధి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు, ఇప్పుడున్న రూ. 118 ప్రీమియంతో పోలిస్తే, కొత్త విధానంలో అదనపు భారం కలిపినా, ప్రీమియం సుమారు రూ. 112.60 మాత్రమే అవుతుంది. “ఈ నిర్ణయం సామాన్యుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. జీఎస్టీ రహిత బీమా విధానం ఆర్థిక చేరికను ప్రోత్సహించి, ప్రతి ఒక్కరికీ భద్రతను అందిస్తుంది” అని ఘాయ్ తెలిపారు. మొత్తం మీద, ఈ కొత్త నిబంధనతో బీమా పాలసీలు మరింత అందుబాటులోకి వస్తాయని, పరోక్షంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad