Homeకెరీర్SBI: ఎస్‌బీఐలో 7,150 అప్రెంటిస్ పోస్టులు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు సువర్ణావకాశం!

SBI: ఎస్‌బీఐలో 7,150 అప్రెంటిస్ పోస్టులు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు సువర్ణావకాశం!

Apprentice posts: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌ల నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

ముఖ్యమైన అర్హతలు: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడంలో ప్రవీణులై ఉండాలి. వయోపరిమితి పరంగా ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అనగా అభ్యర్థులు ఏప్రిల్ 2, 1998 నుండి ఏప్రిల్ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక విధానం: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) మరియు స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకుగాను (100 ప్రశ్నలు) పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాల నుండి 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ మినహా మిగిలిన సబ్జెక్టులను ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ రాసుకోవచ్చు. అయితే ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (0.25) మార్కుల కోత ఉంటుంది. 10వ తరగతి లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు మార్కుల జాబితా సమర్పిస్తే.. వారికి స్థానిక భాషా పరీక్ష నుండి మినహాయింపు ఉంటుంది.

ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు (1 సంవత్సరం) అప్రెంటిస్ షిప్ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణా కాలంలో ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. భవిష్యత్తులో ఎస్‌బీఐ నిర్వహించే జూనియర్ అసోసియేట్ (క్లర్క్) నియామకాల్లో ఈ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది.

దరఖాస్తు రుసుము: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 8, 2026 గా నోటిఫికేషన్‌లో తెలిపారు. జులై 2026 లో పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లోని పోస్టుల వివరాలు:

  • ఆంధ్రప్రదేశ్: 709 పోస్టులు
  • తెలంగాణ: 491 పోస్టులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News