NEET UG Rank list: నీట్ యూజీ–2026 (NEET UG 2026) అభ్యర్థుల కోసం స్టేట్ ర్యాంక్ తాత్కాలిక జాబితాను ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) వెల్లడించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకే తాత్కాలిక ప్రాతిపదికన దీన్ని విడుదల చేసినట్లు వర్సిటీ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తుది మెరిట్ లిస్టుగా పరిగణించవద్దని కోరింది. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలతో మరో ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అధికారిక సమాచారం కోసం అభ్యర్థులు KNRUHS అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించింది.
తాత్కాలిక మెరిట్ లిస్ట్ విశేషాలు: నీట్-2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన తాత్కాలిక జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. రోల్ నెంబర్, పేరు, కేటగిరీ, స్కోర్ వివరాలను నమోదు చేసి అభ్యర్థులు తమ స్థానాన్ని పరిశీలించుకోవచ్చు. ఆలిండియా కోటా భర్తీ అనంతరం.. అభ్యర్థుల స్కోర్లు, రిజర్వేషన్లు, కమ్యూనిటీ సర్టిఫికేట్లను పరిశీలించిన తర్వాతే తుది మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. నీట్ నిబంధనల ప్రకారం ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక కేటగిరీలకు మాత్రం నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా మరో మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. తెలంగాణలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో సీటు దక్కించుకోవాలనుకునే విద్యార్థులు సాధించాల్సిన మార్కులపై నిపుణులు అంచనాలు వెల్లడించారు. అవగాహన నిమిత్తం రూపొందించిన ఈ అంచనాల ప్రకారం తుది జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

