AP StreeNidhi Jobs: ఏపీ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అసిస్టెంట్ మేనేజర్ల పోస్టుల కోసం 170 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్ లైన్‌లో దరఖాస్తులను ఈనెల 7వ తేదీ నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తులను సమర్పించడానికి జులై 18 చివరి తేదీ. దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలి. అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వయసు 21 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగులు అయితే 52 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
అలాగే దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా 4 నుంచి 10వ తరగతి వరకు ఏపీలోనే చదివి ఉండాలి. ఇందుకోసం స్టడీ సర్టిఫికెట్ సమర్పించాలి. అలాగే ఎమ్మార్వో ఆఫీసు నుంచి రెసిడెన్సీ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాలి. ఓసీలకు కనీసం 55% మార్కులు, బీసీలకు 50% మార్కులు, SC/ST /PWDలు 45% మార్కులతో సమానమైన అర్హతను కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు అవసరమైన విద్యార్హతలను కలిగి ఉండాలి. అలాగే MS ఆఫీస్‌లో పరిజ్ఞానం సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్ చేయాలి.
ఎంపికైన అభ్యర్థులకు రూ.25,520 జీతం లభిస్తుంది. అయితే ఉద్యోగం కాంట్రాక్ట్ కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి పోస్టు వ్యవధిని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 29శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.sthreenidhi.ap.gov.in అధికారిక వెబ్ సైట్ సందర్శించండి.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత స్థానిక జిల్లాలో వారికి కేటాయించిన ఏదైనా మండలం లేదా పట్టణాల్లో పనిచేయాలి. స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేది రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సమాజం, రాష్ట్ర సహకార సంఘాల చట్టం 1964 కింద నమోదు చేయబడింది.(AP Stree Nidhi Jobs)