Sunday, February 8, 2026
Homeకెరీర్Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు!

Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు!

AP KGBV jobs:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా సొసైటీ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది.

- Advertisement -

1095 బోధనేతర పోస్టులు..

ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1095 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Also Read: https://teluguprabha.net/career-news/prasar-bharati-recruitment-2026-marketing-executive-jobs-notification/

టైప్ 3 కేటగిరీలో 564 పోస్టులు..

పోస్టుల విభజనను పరిశీలిస్తే టైప్ 3 కేటగిరీలో 564 పోస్టులు, టైప్ 4 కేటగిరీలో 531 పోస్టులు ఉన్నాయి. టైప్ 3 పోస్టుల్లో ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్లు, ఏఎన్ ఎంలు, అకౌంటెంట్లు, అటెండర్లు, హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, డే వాచ్ ఉమెన్, నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్లు, స్వీపర్లు వంటి విభిన్న హోదాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ మరియు ఏఎన్ ఎం పోస్టులకు పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండటం గమనార్హం.

టైప్ 4 కేటగిరీలో వార్డెన్లు, పార్ట్ టైం టీచర్లు, చౌకీదార్లు, హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరీలో అసిస్టెంట్ కుక్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కేజీబీవీ పాఠశాలల రోజువారీ నిర్వహణకు కీలకంగా ఉంటాయి.

కంప్యూటర్ కోర్స్ చేసిన..

అర్హతల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్, చౌకీదార్, అటెండర్ వంటి పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేదు. కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్ లేదా డిగ్రీ పూర్తిచేసి, కంప్యూటర్ కోర్స్ చేసిన అభ్యర్థులు అర్హులు. ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

ఏఎన్ ఎం పోస్టులకు..

ఏఎన్ ఎం పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఏఎన్ ఎం శిక్షణ పొందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్ లేదా ఎంఏ అర్హత తప్పనిసరి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులకే ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

వయో పరిమితి..

వయో పరిమితి విషయానికి వస్తే 2025 జులై 1 నాటికి అభ్యర్థి వయస్సు 45 ఏళ్లు మించకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఐదేళ్ల వయో సడలింపు, దివ్యాంగ మహిళలకు పది సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. ఈ సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అమలులో ఉంటాయి.

ఇంటర్వ్యూ, మెరిట్, రిజర్వేషన్ …

ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, మెరిట్, రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ తుది ఎంపిక చేస్తుంది. అభ్యర్థుల అర్హతలు, అనుభవం మరియు ప్రభుత్వ రిజర్వేషన్ నియమాలను పరిగణనలోకి తీసుకుని జాబితా రూపొందించనున్నారు.

దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ లోనే ఉంటుంది. అర్హత కలిగిన మహిళలు జనవరి 20, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయానికి నేరుగా వెళ్లి దరఖాస్తు పత్రాలతో పాటు అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల ఎంపిక మండలాల వారీగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

Also Read: https://teluguprabha.net/career-news/ap-set-2025-notification-released-for-assistant-professor-eligibility/

దరఖాస్తు చేసిన అభ్యర్థుల మండలాల వారీ జాబితాను జనవరి 23న విడుదల చేస్తారు. తొలి ఎంపిక జాబితా జనవరి 28న, తుది ఎంపిక జాబితా ఫిబ్రవరి 4న ప్రకటిస్తారు. ఫిబ్రవరి 5, 2026న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ తేదీలను అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని అధికారులు సూచించారు.

గ్రామీణ ప్రాంతాల మహిళలకు..

ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. బాలికల విద్యాలయాల్లో అవసరమైన సిబ్బంది అందుబాటులోకి రావడంతో విద్యా సంస్థల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారనుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది ఒక ముఖ్యమైన అవకాశంగా నిలవనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News