Application for Indian Bank Jobs 2025: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంకు వివిధ కేటగిరీల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో స్కేల్ 1, 2, 3, 4లలో వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. క్రెడిట్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కోఆపరేటివ్ క్రెడిట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, చార్టెడ్ అకౌంట్ వంటి వివిధ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆకర్షనీయమైన జీతంతో పాటు అలవెన్సులు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పీజీ, బీఈ/ బీటెక్, ఎంసీఏ, ఎంసీఏ/ ఎంఎస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఎం, ఎల్ఎల్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టులను అనుసరించి 23 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అర్హత గలవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఆకర్షణీయ జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.
ఐఓబీలో 127 పోస్టులు..
మరోవైపు, ప్రైవేటు రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) తాజాగా భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఐఓబీ అధికారిక వెబ్‌సైట్లు iob.in లేదా ibpsonline.ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అర్హత విషయానికి వస్తే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు సాంకేతిక, మేనేజ్‌మెంట్ లేదా సంబంధిత రంగాలలో అర్హత సాధించి ఉండాలి. బీఈ, బీటెక్, బీఆర్క్, ఎంఎస్సీ. ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీడీసీఏ, పీజీడీబీఏ వంటి డిగ్రీలు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా, అభ్యర్థులు ఆన్‌లైన్ రాత పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్న ఒక మార్కు విలువైనది. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది.


