విశాఖపట్నం (తెలుగు ప్రభ): ఏపీ విద్యుత్ రంగంలో సాంకేతిక సిబ్బంది పెంపుతో పాటు అర్హత కలిగిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఏపీ విద్యుత్ సంస్థల్లో ఏఈఈల నియామకం చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యుత్ సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేశాయని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ సంస్థల్లో 629అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 1,05,566 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారన్నారు.
ఈ నెల 23నుంచి 27వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నామని, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 94 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసి, పరీక్షను పారదర్శకంగా, పకడ్బందీగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టినట్టు సీఎండీ వివరించారు. అర్హులకు సమానమైన, న్యాయమైన అవకాశాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారని, విశ్వసనీయతను కాపాడేందుకు సాంకేతికత, బయోమెట్రిక్ ధృవీకరణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, కేంద్ర స్థాయి మానిటరింగ్‌తో పాటు పటిష్ట పరిపాలనా, భద్రతా చర్యల్ని చేపట్టామని, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సీఎండీ స్పష్టం చేశారు.
మూడు గంటల పాటు పరీక్ష
కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఈ నెల 23నుంచి ఐదు రోజుల పాటు అవసరాన్ని బట్టి రెండు సెషన్లలో నిర్వహించనున్నామని సీఎండీ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని వివరించారు. ఉదయం 7.30 నుంచి అభ్యర్థులకు రిపోర్టింగ్ సమయం ఉంటుందని, 9గంటలకు గేట్లు మూసేస్తారని, రెండో సెషన్‌లోనూ అదే పరిస్థితి ఉంటుందన్నారు.
ఏర్పాటైన 94కేంద్రాల్లో 81 కేంద్రాలు ఏపీలోనే ఉన్నాయని, మరో 13 కేంద్రాలు రాష్ట్రం వెలుపల ఉన్నాయని సీఎండీ తెలిపారు. పరీక్ష ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రం లేదా సమాధానాల సమాచారాన్ని అక్రమంగా ప్రసారం చేయకుండా మొబైల్ జామర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష హాళ్లు, ప్రవేశ ద్వారాలు, కారిడార్లు, సర్వర్ రూముల్ని సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని, విజయవాడలోని విద్యుత్ సౌధలో ఏర్పాటు చేసిన కేంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరీక్షా కేంద్రాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించే ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అంతరాయం ఉండదు
విద్యుత్, సాంకేతిక సమస్యల కారణంగా పరీక్షకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సీఎండీ తెలిపారు. అభ్యర్థులు నమోదు చేసిన సమాధానాలు ఆటోమేటిక్‌గా సేవ్ అయ్యేలా వ్యవస్థను రూపొందించామని, దీంతో సాంకేతిక సమస్య తలెత్తినా అప్పటికే నమోదు చేసిన సమాధానాలు కోల్పోకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌లోని సూచనలు తప్పనిసరిగా పాటించాలని, హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. ప్రింటెడ్ హాల్‌టిక్కెట్‌తో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ వంటి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. బయోమెట్రిక్ ధృవీకరణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పూర్తిగా సహకరించాలని కోరారు. ఎలక్ట్రానిక్/కమ్యూనికేషన్ పరికరాల్ని తీసుకు రావడం పూర్తిగా నిషేధమని, అలా అయితే హాల్‌లోకి అనుమతించరని స్పష్టం చేశారు.
చివరి పరీక్ష జరిగిన తేదీ నుంచి మూడ్రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేసి, అనంతరం ఏడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫై చేసిన ఖాళీలకు 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థుల పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తారని, తుది ఎంపిక, కేటాయింపు పూర్తిగా మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు, అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుందని సీఎండీ పేర్కొన్నారు. నియామక పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక ప్రకటనలు, అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను మాత్రమే ఆధారంగా చేసుకోవాలని, పుకార్లు, తప్పుడు సమాచారం లేదా అనధికార వ్యక్తుల మాటల్ని నమ్మొద్దని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆ ప్రకటనలో సూచించారు.

