Gate 2026 Notification: దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న గేట్ 2026కు సంబంధించి కీలక సమాచారం వచ్చేసింది. ఈ పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారిక వెబ్‌సైట్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ప్రారంభించింది. gate2026.iitg.ac.in అనే వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలు ఉంచారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వచ్చే నెల 25వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు అందులో పేర్కొన్నారు.
గేట్ పరీక్షను..
ఇంజినీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ వంటి విభాగాల్లో ఉన్నత విద్యలో ప్రవేశానికి ఉపయోగపడే ఈ గేట్ పరీక్షను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు పర్యవేక్షణలో IISC మరియు వివిధ IITలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈసారి గేట్ 2026 పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో రెండు వారాంతాల్లో జరగనున్నాయి. ఫలితాలు మార్చి 19న విడుదల చేయాలని ప్రణాళిక ఉంది.
రెగ్యులర్ దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 25 వరకు ఉంటుంది. ఈ గడువు తర్వాత ఆలస్య రుసుముతో అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో ముందుగానే ప్లాన్ చేసుకుని దరఖాస్తు చేయడం ఉత్తమం.
ఈ పరీక్షకు అర్హత సాధించాలంటే, మూడో సంవత్సరం లేదా అంతకంటే పై ఏడాది చదువుతున్న విద్యార్థులు అర్హులు. అదే విధంగా, ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, సైన్స్, ఆర్కిటెక్చర్ వంటి విభాగాల్లో ప్రభుత్వ అనుమతి పొందిన డిగ్రీ పూర్తిచేసినవారు కూడా పరీక్షకు అర్హులే. అంతేకాదు, విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ చదువుతున్నవారు లేదా సమానమైన స్థాయి విద్య అభ్యసిస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకునే హక్కు కలిగినవారే.
ఇక ప్రొఫెషనల్ సంస్థలైన ఐఈ, ఐసీఈ, ఐఈటీఈ, ఐఐఈ, ఐఐసీహెచ్‌ఈ, ఏఈఎస్ఐ వంటి సంస్థల నుంచి సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు అర్హులు. కానీ, వారి సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఏఐసీటీఈ, యూజీసీ, ఎంఓఈ వంటి అధికారిక సంస్థల అంగీకారాన్ని పొందాలి.
మొత్తం 30 సబ్జెక్టులపై..
ఈసారి గేట్ పరీక్ష మొత్తం 30 సబ్జెక్టులపై జరుగుతుంది. అభ్యర్థులు ఒక్క పేపర్ మాత్రమే కాకుండా, అవసరమైతే రెండవ పేపర్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. అయితే రెండు పేపర్ల కలయికలు ముందుగానే నిర్ణయించినవే కావడంతో, వాటిని మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు ఒక్క దరఖాస్తులోనే రెండవ పేపర్‌ను జోడించాలి. ఒక వ్యక్తి ఒకకంటే ఎక్కువ దరఖాస్తులు చేయకూడదు. చేస్తే అవి తిరస్కరించబడతాయి మరియు రుసుము తిరిగి ఇవ్వరు.
ఎనర్జీ సైన్స్ (XE-I)’..
ఈసారి గేట్ 2026లో ఒక కొత్త సబ్జెక్టును కూడా చేర్చారు. ఇంజినీరింగ్ సైన్సెస్ విభాగంలో ‘ఎనర్జీ సైన్స్ (XE-I)’ అనే కొత్త పేపర్‌ను ప్రవేశపెట్టారు. ఇది అభ్యర్థులకు మరింత స్పెషలైజేషన్ అవకాశాన్ని కల్పిస్తుంది.
పరీక్ష విధానం విషయానికి వస్తే, ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. అందులో జనరల్ ఆప్టిట్యూడ్ భాగానికి 15 మార్కులు, మిగిలిన 85 మార్కులు సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలకు ఉంటాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు దేశంలోని అనేక కేంద్రాల్లో జరగనున్నాయి.
గేట్ స్కోరు దేశవ్యాప్తంగా అనేక పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అనువుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో కూడా గేట్ స్కోరును మెరిట్ కి కేటాయిస్తారు. దీంతో, విద్యార్థులు గేట్‌ను సమర్థవంతంగా రాయడం వల్ల వారు కెరీర్‌లో మంచి అవకాశాలను అందుకునే అవకాశాలు పెరుగుతాయి.


