IIT Madras School Connect courses : బడికెళ్లే పిల్లల్ని ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ప్రశ్నిస్తే ఒకప్పుడు డాక్టర్, ఇంజినీర్ అనే సమాధానాలు వినిపించేవి. కానీ నేటి తరం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఏఐ నిపుణుడు అంటూ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. మరి డిగ్రీ స్థాయిలో నేర్చుకునే అత్యాధునిక పాఠాలు పాఠశాల దశలోనే ఒంటబట్టే వీలుంటే? దేశంలోనే మేటి విద్యాసంస్థ ఐఐటీ విద్యార్థులకు స్వయంగా దిశానిర్దేశం చేస్తే ఆ చిన్నారుల భవితవ్యం ఎంతటి ఉజ్వలంగా మారుతుంది? అసలు ఈ అరుదైన అవకాశం ఎవరికి దక్కుతుంది?
విద్యా అంతరాలను చెరిపేసేలా ‘స్కూల్ కనెక్ట్’ : పాఠశాల విద్యకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు మధ్య వారధి నిర్మించాలనే సత్సంకల్పంతో ‘ఐఐటీ మద్రాస్’ వినూత్నంగా ‘స్కూల్ కనెక్ట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొమ్మిది నుంచి పన్నెండో తరగతి చదివే విద్యార్థులకు టెక్నాలజీ రంగాలపై కనీస అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేవలం రూ.500 నామమాత్రపు రుసుముతో ఈ శిక్షణ అందిస్తున్నారు. దేశ, విదేశాల్లోని 5,000కు పైగా పాఠశాలలతో ఐఐటీ ఎంవోయూ చేసుకోగా, ఏపీ, తెలంగాణల నుంచే 1.80 లక్షల మంది ఇప్పటికే నమోదు చేసుకున్నారు.
19 విభిన్న కోర్సులు – నిపుణుల బోధన : ఎనిమిది వారాల వ్యవధితో ఏడాదికి నాలుగు బ్యాచ్‌లుగా ఈ కోర్సులు సాగుతాయి. డేటా సైన్స్ & ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్, ఫోరెన్సిక్ సైన్స్, మాలిక్యులర్ ఇంజినీరింగ్, ఎకనామిక్స్ సహా మొత్తం 19 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు డిజైన్ చేసిన రికార్డెడ్ వీడియో పాఠాలతో పాటు, విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం నిపుణులు ప్రత్యేక లైవ్ సెషన్లను నిర్వహిస్తారు.
అర్హతకు గీటురాయిగా సర్టిఫికెట్లు : కోర్సు సమయంలో నిర్వహించే నాలుగు అసెస్మెంట్ పరీక్షల్లో మూడింట్లో కనీసం 40% మార్కులు సాధిస్తే ‘పార్టిసిపేషన్ సర్టిఫికెట్’, తుది పరీక్షలో నెగ్గితే ‘కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్’ అందిస్తారు. అదనంగా ప్రాజెక్టు సమర్పిస్తే ‘టేక్ హోమ్ ప్రాజెక్ట్ సర్టిఫికెట్’ దక్కుతుంది. ఐఐటీ మద్రాస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ అందించే ఈ గుర్తింపు భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో విద్యార్థులకు తిరుగులేని ఆధిక్యాన్ని అందిస్తుంది. ఆసక్తిగలవారు అధికారిక పోర్టల్ (code.iitm.ac.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

