JEE Main 2026 Schedule Released: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో అడ్మిషన్ల కోసం ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. జేఈఈ మెయిన్ 2026 సెషన్-1కు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను సైతం ఇవాళ (గురువారం) విడుదల చేసింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు www.jeemain.nta.nic.in ద్వారా తమ పరీక్ష సెంటర్ ఏ నగరంలో ఉందో తెలుసుకోవచ్చు. పరీక్ష నగరాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా సమయానికి కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 2026 జనవరి 21వ తేదీ నుంచి 29 వరకు షిఫ్టుల వారిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్టీఏ జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించి మీ ఎగ్జామ్ సెంటర్ ఏ నగరంలో ఉందో తెలుసుకొనేలా జేఈఈ మెయిన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2026ను ఎన్‌టీఏ ఈ రోజు (గురువారం) అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
పరీక్ష ఇంటిమేషన్ స్లిప్‌ల విడుదల..
కాగా, జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఎగ్జామ్ షెడ్యూల్‌లో పేర్కొంది. జనవరి 29న పేపర్ 2ఎ (బీఆర్క్), పేపర్ 2బీ (బీ ప్లానింగ్), పేపర్ 2ఎ, 2బీ (బీఆర్క్, బీ ప్లానింగ్ రెండూ కలిపి) ఒకే షిఫ్టులో జరగనున్నాయి. ఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 2.30 గంటల పాటు జరుగుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు కేవలం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోనే కాకుండా, విదేశాల్లోని 15 నగరాల్లోనూ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్ (ఎగ్జామ్స్) తెలిపారు. దీనికి గాను ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేశామన్నారు. ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల డౌన్‌లోడ్ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అభ్యర్థులు 011-40759000 నంబర్‌కు లేదా [email protected] ద్వారా సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పరీక్షకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకొనేందుకు తమ అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, జేఈఈ మెయిన్స్ పరీక్ష, భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఒకటి. దీని ద్వారా విద్యార్థులు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్ పొందవచ్చు. ఇది ఐఐటీల్లో ప్రవేశానికి అవసరమయ్యే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హతను నిర్ణయిస్తుంది.

