Saturday, November 15, 2025
Homeకెరీర్JEE Mains: జేఈఈ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల.....

JEE Mains: జేఈఈ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..!

JEE Mains Exam Schedule and Exam Dates Release: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్ల భర్తీకి ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షకు సిద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్‌టీఏ(NTA) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)కి ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ అందుబాటులోకి వస్తుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేలా ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నామని తెలిపింది. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంది. కాగా, పరీక్ష షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నాయి. ఈ సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ అక్టోబర్ నెల నుంచే ప్రారంభమవుతుందని ఎన్టీఏ తెలిపింది. కచ్చితమైన తేదీలను త్వరలో ప్రకటిస్తారు. మరోవైపు, జేఈఈ మెయిన్‌ సెషన్-2 పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 10 తేదీల మధ్య నిర్వహిస్తారు. సెషన్-2 పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి చివరి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెండు సెషన్లకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు.

- Advertisement -

ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోండి..

జేఈఈ (మెయిన్‌) 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ ఇటీవల కోంది. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, చివరి నిమిషంలో దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది. అందుకే, ఆయా అభ్యర్థులు తమ ఆధార్‌ (ఆధార్‌ కార్డులో పేరు), పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్‌ ప్రకారం) సరిగా ఉండేలా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అలాగే, తాజా ఫొటోగ్రాఫ్‌, ఇంటి అడ్రస్‌, తండ్రి పేరు మీ కార్డులో అప్‌డేట్‌ అయి ఉండాలని పేర్కొంది. ఇక, దివ్యాంగ అభ్యర్థులైతే.. యూడీఐడీ కార్డు చెల్లుబాటవుతుంది. అయితే, రెన్యువల్‌ చేయించుకొని అప్‌డేట్‌గా ఉంచుకోవాలని తెలిపింది. మరోవైపు, ఈడబ్ల్యూఎస్‌/ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-(నాన్‌ క్రిమి లేయర్‌) అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. కాగా, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దరఖాస్తులు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇక, రిజిస్ట్రేషన్ వివరాల కోసం అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.inను తరచుగా సందర్శించాలని ఎన్‌టీఏ అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad