Hyderabad Central University: దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UoH).. 2026-2028 విద్యా సంవత్సరానికి గానూ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేనేజ్‌మెంట్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇదొక అద్భుతమైన అవకాశం.
కోర్సు వివరాలు: వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఈ రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. మొత్తం 75 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కల్గిన విద్యార్థులకు దరఖాస్తు రుసమును రూ.600గా నోటిఫికేషన్‌లో తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ (EWS)కు రూ.550, ఓబీసీ (OBC)లకు రూ.400, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు (SC,ST,PwD)లకు రూ.275లను దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.
అర్హత మరియు ఎంపిక విధానం: అభ్యర్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఐఐఎం-కోల్‌కతా నిర్వహించిన క్యాట్ (CAT)-2025, ఏఐఎంఏ నిర్వహించిన మ్యాట్ (MAT)-2025 లేదా ఎన్‌టీఏ నిర్వహించిన సీమ్యాట్ (CMAT)-2026 పరీక్షలకు హాజరైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులుగా నోటిఫికేషన్‌లో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి స్కోర్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్ (GD)తో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ (PI) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
Also read-SBI: నిరుద్యోగులకు తీపికబురు.. 2,273 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
ముఖ్య సమాచారం: ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించడానికి జనవరి 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. నేడే చివరి అవకాశం కావడంతో అర్హులైన అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ వర్గాలు సూచించాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

