NCERT career guidance app : పది, ఇంటర్ తర్వాత ఏం చదవాలి? ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది..? చుట్టూ ఉన్నవారంతా సాఫ్ట్‌వేర్ అంటున్నారని, అందులోకే వెళ్ళిపోవాలా..? లేక మనసుకు నచ్చిన దారిలో నడవాలా..? ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రుల మదిని తొలిచే ప్రశ్నలివి. ఈ గందరగోళానికి తెరదించుతూ, మీ ఆసక్తికి, అభిరుచికి ఏ కెరీర్ సరిగ్గా సరిపోతుందో చెప్పేందుకు ఓ డిజిటల్ గురువు వచ్చేశాడు. అదే కేంద్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) అందుబాటులోకి తెచ్చిన ‘మై కెరీర్ అడ్వైజర్’ యాప్. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది..? నిజంగానే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందా..? ఇందులో ఉన్న లోటుపాట్లేమిటి..? ఆ వివరాలు మీకోసం.
యాప్ కథాకమామీషు : దేశంలో కెరీర్ గైడెన్స్ లోటును భర్తీ చేసేందుకు ఎన్‌సీఈఆర్‌టీ, ప్రముఖ వాధ్వానీ ఫౌండేషన్‌తో కలిసి ఈ యాప్‌ను రూపొందించింది. ముఖ్యంగా పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ తదుపరి ఉన్నత విద్యా ప్రయాణాన్ని సరైన మార్గంలో ఎంచుకోవడమే ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కెరీర్ కౌన్సెలర్ల కొరతను ఈ యాప్ కొంతమేర తీర్చగలదని భావిస్తున్నారు.
ఎలా పనిచేస్తుంది : ఈ యాప్‌ను ఉపయోగించడం ఒక ఆన్‌లైన్ పరీక్ష రాసినట్లే ఉంటుంది.
మొదటి అడుగు: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘My Career Advisor’ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
రెండో అడుగు: యాప్‌లో మీ పేరు, తరగతి వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి.
మూడో అడుగు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్ట్స్, గేమింగ్ వంటి అనేక కోర్సుల జాబితా కనిపిస్తుంది. మీరు ఏ రంగంలోకి వెళ్లాలని ఆసక్తిగా ఉన్నారో ఆ కోర్సును ఎంచుకోవాలి.
నాలుగో అడుగు: మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించి మీ ఆసక్తిని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాటికి నిజాయతీగా సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రక్రియకు సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది.
తుది ఫలితం: ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాక, మీకు ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్‌ను బట్టి, మీరు ఎంచుకున్న కోర్సు లేదా రంగంలో రాణించడానికి మీకు ఎంతవరకు సామర్థ్యం, అభిరుచి ఉన్నాయో ఈ యాప్ శాస్త్రీయంగా విశ్లేషించి చెబుతుంది.
నిపుణుల మాట.. చిన్నపాటి లోటుపాట్లు : ఈ యాప్‌పై కెరీర్ కౌన్సెలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పందిస్తూ, “ప్రస్తుత విద్యా విధానంలోని లోపాన్ని గుర్తించి యాప్‌ను తీసుకురావడం శుభపరిణామం. అయితే ఇది విద్యార్థి సామాజిక, కుటుంబ, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోదు. ఇది విద్యార్థి ఫలానా కోర్సులో రాణిస్తాడని చెప్పదు, కానీ అతను ఆసక్తి చూపుతున్న కోర్సుకు తగినవాడా కాదా అని అంచనా వేస్తుంది,” అని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం యాప్ కేవలం ఆంగ్లంలోనే అందుబాటులో ఉండటం ఒక ప్రధాన లోపం. ఇంగ్లీష్‌పై పట్టులేని గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడతారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ఈ యాప్‌ను విద్యార్థులు వినియోగించుకునేలా విద్యాశాఖ చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.


