Global largest competitive entrance examinations : వైద్య విద్య కలల సౌధానికి దారితీసే ‘నీట్ యూజీ’ (NEET-UG) మునుపెన్నడూ లేని పెనుమార్పునకు సిద్ధమవుతోందా? పేపర్ లీకేజీల సమస్యకు చెక్ పెట్టేందుకు పెన్-పేపర్ విధానానికి స్వస్తి పలికి, కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) రూపాంతరం చెందనుందా? మరోవైపు, ఏటా దాదాపు 25 లక్షల మంది రాసే ఈ భారతీయ ప్రవేశ పరీక్ష ప్రపంచ స్థాయి పోటీలో ఎక్కడ నిలిచింది?
విశ్వ వేదికపై ‘నీట్’ స్థానం : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక మంది రాసే పరీక్షల జాబితాలో భారత ‘నీట్ యూజీ’ 5వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనాకు చెందిన జాతీయ కళాశాల ప్రవేశ పరీక్ష ‘గావోకావో’ (Gaokao) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ‘ENEM’ రెండో స్థానంలో ఉండగా, చైనా సివిల్ సర్వీస్ పరీక్ష ‘గువోకావో’ మూడో స్థానంలో నిలిచింది.
గావోకావో రికార్డు : 1952లో ఆరంభమైన ‘గావోకావో’ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. 2024లో ఏకంగా 1.34 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అక్రమాలను అరికట్టేందుకు అక్కడ ఏఐ (AI) కెమెరాలు, డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తారు.
ఆన్లైన్ దిశగా భారత్ అడుగులు : ప్రస్తుతం జేఈఈ (JEE) ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లే, నీట్‌ను కూడా పకడ్బందీగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలోకి తీసుకురావాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. తద్వారా లీకేజీలకు తావులేకుండా, విద్యార్థుల ప్రతిభకు పూర్తి న్యాయం జరిగేలా పారదర్శక సాంకేతిక వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

