NMMS Scholarship For Merit Students: ప్రతిభ గల విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ ద్వారా ఏటా స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. అయితే, ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు గడువు ముగుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 18 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఎగ్జామ్ ఫీజును చెల్లించవచ్చని ప్రకటన విడుదల చేసింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 22 లోపు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల ముద్రిత కాపీలు, నామినల్ రోల్స్ (టూ కాపీలు), ఫీజు రిసిప్ట్‌లను సంబంధిత జిల్లా విద్యా అధికారి (డీఈఓ)కి సమర్పించాల్సి ఉంటుంది. డీఈఓలు ధృవీకరించిన సర్టిఫికెట్లను అక్టోబర్ 24 లోపు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ప్రతి నెలా రూ.1,000 చొప్పున, ఏడాదికి రూ.12,000 ఉపకార వేతనం అందుతోంది. నాలుగు సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.48,000 ఆర్థిక సహాయం విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు లక్ష మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.
స్కాలర్‌షిప్ దరఖాస్తుకు అర్హత ప్రమాణాలివే..
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందడానికి విద్యార్థులు పలు అర్హతలను కలిగి ఉండాలి. విద్యార్థి ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న వారు ఈ స్కాలర్షిప్ స్కీమ్‌కు అర్హులు అవుతారు. ఏడో తరగతి ఫైనల్ పరీక్షల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు వచ్చినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3,50,000 మించకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరే ఇతర స్కాలర్‌షిప్ పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్థులు అనర్హులు. మరోవైపు, విద్యార్థుల ఎంపిక ఒక రాష్ట్ర స్థాయి రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షలో ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి. ముందుగా జరిగే మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో రీజనింగ్, లాజికల్ థింకింగ్ కు సంబంధించిన 90 ప్రశ్నలు ఉంటాయి. అనంతరం ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 7వ, 8వ తరగతి పాఠ్యాంశాల (సైన్స్, సోషల్, మ్యాథ్స్) ఆధారంగా 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 90 నిమిషాల సమయం ఉంటుంది. ఈ రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
అర్హత గల వారు అక్టోబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా విద్యార్థులకు నవంబర్ 23న పరీక్ష ఉంటుంది. విద్యార్థులు చదువుతున్న స్కూల్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు తమ దరఖాస్తులను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా లేదా సంబంధిత రాష్ట్ర విద్యా శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.


