Regional AI talent development : సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సునామీకి చిరునామాగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తెలుగు యువత తమ సత్తా చాటుతోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన ఓపెన్ ఏఐ ( OpenAI) అకాడమీ, నెక్స్ట్ వేవ్ (NxtWave) సంయుక్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘బిల్డాథాన్’లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి గ్రాండ్ ఫినాలేకు దూసుకెళ్లారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం తమ ఆవిష్కరణలతో అబ్బురపరిచారు. అసలు ఈ బిల్డాథాన్ లక్ష్యం ఏమిటి..? మన విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు సమాజంలోని ఏయే సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నాయి..? జాతీయ వేదికపై మన విద్యార్థుల ప్రయాణం ఎలా సాగనుంది..?
భారత ప్రభుత్వపు ప్రతిష్టాత్మక ‘IndiaAI మిషన్’లో భాగంగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో ఈ బిల్డాథాన్‌ను నిర్వహించారు. ఫిబ్రవరిలో జరగనున్న ‘IndiaAI Impact 2026’ ప్రపంచ సదస్సుకు ప్రీ-సమ్మిట్ ఈవెంట్‌గా దీనికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం వంటి కీలక రంగాల్లో AI ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన : ఇటీవల విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించిన ప్రాంతీయ బిల్డాథాన్లకు అనూహ్య స్పందన లభించింది.
హైదరాబాద్ బిల్డాథాన్: ఈ కార్యక్రమానికి 900 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
విజయవాడ బిల్డాథాన్: ఇక్కడ 500 మందికి పైగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి, తదుపరి దశకు అర్హత పొందారు.
“మొత్తం మీద, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 100 మంది (25 బృందాలు) జాతీయ స్థాయి గ్రాండ్ ఫినాలేకు ఎంపికయ్యారు. గీతం-వైజాగ్, ఐఐఐటీ-కర్నూలు, మోహన్ బాబు విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి, విజ్ఞాన్ వంటి అనేక కళాశాలల విద్యార్థులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రామీణ ప్రతిభకు పట్టం కట్టాం”
_____రాహుల్ అట్టులూరి, సీఈఓ, నెక్స్ట్ వేవ్
ఈ సందర్భంగా NxtWave సీఈఓ, సహ వ్యవస్థాపకుడు శ్రీ రాహుల్ అట్టులూరి మాట్లాడుతూ, “ఈ బిల్డాథాన్ల ద్వారా మేము టైర్-2, టైర్-3 నగరాల్లో దాగి ఉన్న AI ప్రతిభను వెలికితీశాం. వారికి సరైన వేదిక, మార్గదర్శకత్వం అందించి, వారి ఆలోచనలను వాస్తవ ప్రపంచ ఆవిష్కరణలుగా మార్చే అవకాశం కల్పించాం. AI విద్యను ప్రజాస్వామ్యీకరించడమే మా లక్ష్యం. ప్రపంచ AI ప్రతిభ తదుపరి తరంగం భారతదేశం నుంచే వస్తుందని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది,” అని అన్నారు.
సమస్యలకు పరిష్కారాలు.. అబ్బురపరిచిన ఆవిష్కరణలు : ఈ పోటీలలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు మహిళా సాధికారత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించడం విశేషం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.
బిజ్‌నోవా (Biznova): చిన్న దుకాణదారులు తమ వ్యాపార లెక్కలను (అమ్మకాలు, ఖర్చులు, సరుకు నిల్వలు) తమ ప్రాంతీయ భాషలో, కేవలం వాయిస్ ఆదేశాల ద్వారా సులభంగా నిర్వహించుకునే AI వేదిక.
డిజిటల్ కృషి అధికారి: స్థానిక వాతావరణం, పంటల ఆధారంగా రైతులకు వారి భాషలోనే నిజ-సమయ వ్యవసాయ సలహాలు అందించే బహుభాషా AI సహాయకుడు.
హెల్త్‌మేట్ (HealthMate): వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్లను డీకోడ్ చేయడం, కుటుంబ ఆరోగ్య రికార్డులను భద్రపరచడం, సంక్లిష్టమైన వైద్య సమాచారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించే వ్యక్తిగత AI ఆరోగ్య సహచరుడు.
లీగల్‌మైండ్ (LegalMind): క్లిష్టమైన న్యాయపరమైన పత్రాల్లోని కీలక పదాలను, ఐపీసీ సెక్షన్లను గుర్తించి, వాటిని సరళమైన భాషలో వివరించి న్యాయ సలహాలను సులభతరం చేస్తుంది.
ఏఐ-ఎఫ్‌ఐఆర్ విజన్ (AI-FIR Vision): వీడియో ఫుటేజ్‌ను విశ్లేషించడం ద్వారా నేరాలను గుర్తించి, ఎఫ్‌ఐఆర్ దాఖలు ప్రక్రియను ఆటోమేట్ చేసి, పోలీసు వ్యవస్థను ఆధునికీకరిస్తుంది.
గ్రాండ్ ఫినాలేకు పయనం : ప్రస్తుతం రాష్ట్ర స్థాయి క్వాలిఫైయర్స్‌కు చేరిన ఈ బిల్డాథాన్, త్వరలో నోయిడా, జైపూర్, పూణే, బెంగళూరు, చెన్నై నగరాల్లో జరగనుంది. జనవరి 2026లో జరిగే గ్రాండ్ ఫినాలేలో, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 25 విజేత జట్లు ఇతర రాష్ట్రాల టాపర్లతో పోటీపడతాయి. అంతిమ విజేతలు తమ ఆవిష్కరణలను నేరుగా OpenAI అకాడమీకి సమర్పించి, ప్రపంచ వేదికపై ప్రదర్శించే సువర్ణావకాశం పొందుతారు.


