Job creation: మారుతున్న కాలానికి మరియు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి సరికొత్త కోర్సులు, ఆధునిక సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) నుంచి 50 శాతానికి పైగా అనుమతులు లభించినట్లు అధికారులు వెల్లడించారు.
రానున్న 12 కొత్త కోర్సులు: పరిశ్రమల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు తక్షణ ఉపాధి లభించేలా సుమారు 12 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ భాగస్వామ్యంతో ‘ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్’ కోర్సును ప్రారంభించనున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్, ల్యాండ్‌స్కేప్ డిజైన్ వంటి వినూత్న కోర్సులను కూడా చేర్చారు.
సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తప్పనిసరి: సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో, ప్రతి పాలిటెక్నిక్ విద్యార్థికి ఏఐ (AI)పై అవగాహన ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక థియరీ సబ్జెక్టుతో పాటు, ల్యాబ్ సెషన్‌ను కూడా తప్పనిసరి చేశారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, టాటా టెక్నాలజీస్, సీఐఐ (CII) ప్రతినిధుల సహకారంతో ఈ నూతన పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నారు.
4 వేల అదనపు సీట్లు!: గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షల విధానంలో కీలక మార్పు చేశారు. మొదటి సంవత్సరంలో సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, వచ్చే ఏడాది నుంచి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,000 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఉత్తీర్ణత శాతం పెంపే లక్ష్యం: ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యలో సగటు ఉత్తీర్ణత 60 నుంచి 75 శాతంగా ఉంది. కొత్త కోర్సులు, ఆధునిక సిలబస్ మరియు ప్రయోగాత్మక విద్య ద్వారా ఈ ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పాత కోర్సుల పేర్లను మార్చడంతో పాటు సిలబస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు.

