Homeకెరీర్Model schools: మోడల్‌ స్కూళ్లలో స్టేట్ సిలబస్‌కు మంగళం

Model schools: మోడల్‌ స్కూళ్లలో స్టేట్ సిలబస్‌కు మంగళం

హైదరాబాద్‌, (తెలుగుప్రభ) : రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్‌ఈ పాఠశాలలుగా మార్చే అంశంపై విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర సిలబస్‌ను పక్కనపెట్టి కేంద్ర సిలబస్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  ముఖ్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కొన్ని పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేయడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించాలనే ఆలోచన ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ, స్టేట్‌ సిలబస్‌ను కాదని సీబీఎస్‌ఈ సిలబస్‌ను విద్యార్థులపై ఎలా రుద్దుతారన్న చర్చ జరుగుతోంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ను రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకొస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించడం వల్ల అభ్యాసన సామర్థ్యాలు బాగా దెబ్బతింటాయని, పైగా దాని ఎన్‌రోల్‌మెంట్‌ శాతం గతం కంటే ఇంకా ఎక్కువగా పడిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోడల్ స్కూళ్లపై దృష్టి
రాష్ట్రంలో ప్రస్తుతం 194 మోడల్‌ స్కూళ్లు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలల్లో ప్రస్తుతం రాష్ట్ర సిలబస్‌ అమలవుతోంది. ఇంటర్మీడియట్‌ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆయా పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరంలో దాదాపు 50 వేల మంది విద్యార్థులు బడి మానేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడల్‌ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వాటిని సీబీఎస్‌ఈ పాఠశాలలుగా మార్చే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. సీబీఎస్‌ఈపై తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తిని ఉపయోగించుకుని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించాలన్నది అధికారుల ఉద్దేశంగా తెలుస్తోంది.
రాష్ట్ర సిలబస్‌కు ప్రాధాన్యం ఏది?
ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్‌ఈ విధానంలోకి తీసుకురావడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర సిలబస్‌లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. సీబీఎస్‌ఈ పాఠశాలల సంఖ్య పెరిగితే రాష్ట్ర సిలబస్‌ అమలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, యాస, కవులు, కళాకారులకు సంబంధించిన అంశాలకు రాష్ట్ర సిలబస్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, కేంద్ర సిలబస్‌ విస్తృతంగా అమలు చేస్తే స్థానిక అంశాలకు తగిన ప్రాధాన్యం దక్కకపోవచ్చని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఎన్‌రోల్‌మెంట్‌ పెంపే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్‌ఈ విధానానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాఠశాలల్లో ఈ సిలబస్‌ను ప్రవేశపెడితే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ విద్యా సంస్థల వైపు మళ్లించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే సీబీఎస్‌ఈ పాఠశాలలను పెంచడంతో పాటు రాష్ట్ర సిలబస్‌ పాఠశాలలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌తో పాటు బోధనా ప్రమాణాలు మెరుగుపడితేనే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయని చెబుతున్నారు.
2004లోనే వ్యతిరేకించాం: యూటీఎఫ్‌‌టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
మోడల్‌ స్కూళ్లలో సీబీఎస్‌ఈ అమలు నిర్ణయాన్ని గతంలోనే వ్యతిరేకించామని యూటీఎఫ్‌-టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి తెలిపారు. 2004లో మోడల్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంతో పాటు సీబీఎస్‌ఈ అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడంతో అప్పట్లో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగానే రాష్ట్రాల్లో కేంద్ర సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముందుగా మోడల్‌ స్కూళ్లను సీబీఎస్‌ఈ పరిధిలోకి తీసుకురావాలని కసరత్తు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు స్థానిక భాష, యాస, సంస్కృతి, చరిత్రపై అవగాహన తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్‌ స్కూళ్లలో సీబీఎస్‌ఈ అమలు ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చావ రవి డిమాండ్‌ చేశారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News