Reliance Foundation Undergraduate Scholarship 2026 : పేదరికం ప్రతిభావంతుల చదువుకు ఏనాడూ అడ్డంకి కారాదన్న సదాశయంతో దేశీయ దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఫౌండేషన్’ డిగ్రీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఉన్నత చదువుల కల సాకారానికి బాసటగా నిలుస్తూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూజీ స్కాలర్షిప్ల కింద ఏకంగా రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.
రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం: డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన అర్హులైన విద్యార్థులకు ఉన్నత చదువుల ఖర్చుల నిమిత్తం రిలయన్స్ ఫౌండేషన్ మొత్తం రూ.2 లక్షల ఉపకార వేతనాన్ని అందించనుంది. దీనికి దరఖాస్తు లేదా ప్రవేశ పరీక్ష నిమిత్తం నయాపైసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అర్హతా ప్రమాణాలు: 2026-27 విద్యా సంవత్సరంలో ఏదైనా యూజీ (డిగ్రీ) కోర్సులో రెగ్యులర్ పద్ధతిలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు. ఇంటర్ లేదా తత్సమాన ప్లస్-2 పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.15 లక్షలలోపు ఉండాలి (రూ.2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది).
ఎంపిక & దరఖాస్తు విధానం: అభ్యర్థుల ఇంటర్ మెరిట్, ప్రవేశ ఆప్టిట్యూడ్ పరీక్ష మార్కులు, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక పోర్టల్ ద్వారా అక్టోబర్ 5వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పేద విద్యార్థులకు భవితపై భరోసా కల్పించేందుకు ఇదొక చక్కటి అవకాశం.

