Southern Railway Apprentice Recruitment : రైల్వేలో అడుగుపెట్టి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనుకునే యువతకు ఇది నిజంగా అపురూపమైన సువర్ణావకాశం! ఎలాంటి రాతపరీక్ష గండం లేకుండా, కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగా రైల్వే శాఖలో ప్రవేశించే అరుదైన అవకాశం తలుపు తట్టింది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఏకంగా 4,471 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది.
ఖాళీలు – విభాగాలు : మొత్తం 4,471 ఖాళీలలో ఫ్రెషర్స్, ఎక్స్-ఐటీఐ విభాగాల కింద పోస్టులను కేటాయించారు.
ఫ్రెషర్స్ కేటగిరీ: క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్ (పెరంబూర్)- 80, సెంట్రల్ వర్క్‌షాప్ (పొన్మలై)- 43, రైల్వే హాస్పిటల్ (పెరంబూర్)- 20, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్ (పొదనూర్)- 20.
ఎక్స్-ఐటీఐ కేటగిరీ: క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్ గ్రూప్- 1,528; ఎస్ అండ్ టీ వర్క్‌షాప్ గ్రూప్- 1,488; సెంట్రల్ వర్క్‌షాప్స్ (పొన్మలై)- 1,292.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలు ఉన్నాయి.
విద్యార్హతలు & వయోపరిమితి : పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో NCVT/SCVT గుర్తింపు పొందిన ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: ఫ్రెషర్లకు 15 నుంచి 22 ఏళ్లు, ఎక్స్-ఐటీఐ/ఎంఎల్‌టీ అభ్యర్థులకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్ & ఎంపిక విధానం : ఎంపికైన ఫ్రెషర్లకు (10వ తరగతి) నెలకు రూ.8,200, 12వ తరగతి అర్హత ఉన్నవారికి రూ.9,600, ఎక్స్-ఐటీఐ అభ్యర్థులకు గరిష్ఠంగా రూ.9,600 స్టైపెండ్ లభిస్తుంది. అభ్యర్థులను ఎలాంటి పరీక్ష లేకుండా అకడమిక్ మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకోండిలా : ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 27. అర్హత గల అభ్యర్థులు గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

