SSC CHSL 2025 City intimation slips: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) నిరుద్యోగులకు ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) 2025 టైర్ 1 ఆన్‌లైన్ రాత పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పరీక్షలు మరో వారంలో, అనగా నవంబర్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఎస్సెస్సీ తాజాగా ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను’ (పరీక్ష నగర సమాచార పత్రం) తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ పరీక్ష ఏ నగరంలో జరగనుంది అనే సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు.
అయితే, ఇది అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) కాదని అభ్యర్థులు గమనించాలి. అసలు అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు విడుదల చేయనున్నట్లు ఎస్సెస్సీ తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,131 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO, గ్రేడ్-A) వంటి పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టులకు భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
ఇటీవల, ఎస్సెస్సీ అభ్యర్థుల సౌకర్యార్థం ‘సెల్ఫ్ స్లాట్’ ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా అక్టోబర్ 22 నుంచి 28 వరకు అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్ష కేంద్రం, తేదీ మరియు షిఫ్ట్‌ను ఎంచుకునే అవకాశం కల్పించారు.
ఒకవేళ తాజాగా విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లో అభ్యర్థి ఎంచుకున్న నగరం కాకుండా వేరే నగరం కేటాయించబడి ఉంటే, వారు నవంబర్ 8వ తేదీ వరకు తమ అభ్యంతరాన్ని (రిప్రెజెంటేషన్) కమిషన్‌కు తెలియజేయవచ్చునని ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే, సొంతంగా స్క్రైబ్ సదుపాయం కావాలనుకునే అభ్యర్థులు, వెబ్‌సైట్‌లో కొత్తగా స్క్రైబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దానితో పాటు ఆధార్ ధ్రువీకరణ కూడా పూర్తి చేయాలని ఎస్సెస్సీ స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


